ట్యాగులు

beas-riverఆ కారులో నలుగురం ఉన్నాము. ముడుచుకొని కిటికీకి ఆనుకొని నేను. రవి డ్రైవింగ్ లో ఉన్నాడు. వెంకట్ వెనక సీట్లో కళ్ళు మూసుకొని ఉన్నాడు. ప్రసాదు మాటి మాటికీ వాచీ చూసుకొంటున్నాడెందుకో. మేము నలుగురం షాలినీని చూడటానికి బయలు దేరాము. గీత అక్కడికే నేరుగా వస్తానంది.

“ఇరవై ఏళ్ళయిందా రమ నువ్వు తనని చూసి?” రవి అడిగాడు.

“మోర్ దేన్ దట్” గుర్తుకు తెచ్చుకొంటూ అన్నాను. “నేను ఈ మధ్య షాలినీకి ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ పంపినా నన్ను గుర్తుపట్టనంత కాలం అయ్యింది.“ నవ్వాను.

“షాలినీకి నేను ఫ్రెండ్ ని కాదు. అసలు ఫస్ట్ ఇయర్ తరువాత, మీతో కామన్ క్లాసెస్ అయిపోయాకే తను నన్ను మర్చిపోయి ఉంటుంది. సెకండ్ ఇయర్ నుండి మీ కంప్యూటర్స్ స్టూడెంట్స్ సివిల్ వాళ్ళతో కలిసే వారనుకొంటాను” అన్నాను… ఫస్ట్ ఇయర్లో నూనె పెట్టి నున్నగా దువ్వుకొనే నా జడని, కలర్ పోయిన పింక్ రంగు జార్జెట్ ఓణీని మురిపంగా గుర్తుకు తెచ్చుకోంటూ.

మరి షాలినిని నేను ఎందుకు మర్చిపోలేదు? మర్చిపోయే అమ్మాయేనా షాలిని? ఆ మధ్య మనాలిలో చూసిన బీస్ నది గుర్తుకు వచ్చింది. రోథాంగ్ పాస్ లో పుట్టి పరవళ్ళు తొక్కుతూ పసిపాపల్లాంటి రాళ్ళ మీద స్వచ్ఛంగా పంజాబ్ దాకా ప్రవహించే వ్యాస్ నది. షాలినీ ఎక్కడ పుట్టిందో! అమ్మా నాన్న అప్పుడు అబుదాబీలో డాక్టర్లు. మేనమామ గారి ఇంట్లో ఉంటూ మా కాలేజీలో చేరింది. వంద జలపాతాల ఉత్సాహం, చైతన్యం ఆమెది. గొప్ప స్నేహాన్ని ఆమె తన స్నేహితులకు పంచేది.

“ఫస్ట్ ఇయర్ లో ఆడపిల్లలనందరినీ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది. సొంతంగా ఆమెకు ఉన్న రూమ్ చూసి ముఖంలో ఆశ్చర్యం దాచుకోవటం కష్టమయ్యింది నాకు. ఒకే గదినీ, ఒక మంచాన్ని అందరం పంచుకొనే కుటుంబం అప్పటికి మాది మరి.” గుర్తుకు తెచ్చుకొంటూ చెప్పాను.

“షాలిని మిల్స్ అండ్ బూన్స్ వాళ్ళ మామయ్యకు తెలియకుండా టాయిలెట్ లో కూర్చొని చదివేదాన్నని చెప్పిందపుడు.” నాలో నేనే నవ్వుకొన్నాను. ఉన్నట్లుండి నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నానని అర్ధం అయ్యింది.

“సెకండ్ ఇయర్ లో అమ్మాయిలు ఆర్గనైజ్ చేసిన పిక్నిక్ గుర్తు ఉందా?” అడిగాను.

“ఎందుకు గుర్తు లేదు. అంతా షాలినీ నే కదా చేసింది. పేరుకి మీ అందరిదీ కానీ. మేము ఆహ్వానితులుగా వచ్చి ఎంజాయ్ చేశాము.” రవి అన్నాడు.

“యూ గైస్ వర్ క్రేజీ అబౌట్ హర్. ఈజంట్ ఇట్?’ టీజింగ్ గా అన్నాను.

“నాట్ ఆల్ “ అప్పటి దాకా మాట్లాడని వెంకట్ అన్నాడు.

“ఒకటి మాత్రం నిజం. షాలిని కాలేజీని ఒక ప్రచండ మారుతంలాగా కుదిపేసింది. మన బాచ్ అంటేనే షాలిని బాచ్ గా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ అల్యూమినీస్ చాలా మంది గుర్తుకు తెచ్చుకొంటారు.” రవి అన్నాడు నవ్వుతూ.

మోకాళ్ళ క్రింద దాకా స్కర్ట్స్… టక్ చేసుకొన్న డబల్ పీస్ టాప్స్… హై హీల్స్…. సొంత కారు డ్రైవ్ చేసుకోంటూ … రెండేసి మెట్లు ఒకే సారి దిగుతూ … కారిడార్ లో చెయ్యి ఊపుతూ … షాలినీ రూపం తటిల్లున మెరిసింది ఎక్కడో. ఇంకా హైహీల్స్ అంటే క్రేజ్ అట తనకు.

“బడ్డీకి, షాలినీకి ఎక్కడ పరిచయం?” అడిగాడు ప్రసాదు.

భుజాన కాలేజ్ బాగ్, వాటర్ బాగ్ తగిలించుకొని కారులో కాలేజ్ కి వచ్చే బొద్దుగా ఉండే బుద్దిమంతుడైన సతీష్ గుర్తుకొచ్చాడు నాకు.

“కాలేజీ బయటకు వెళ్ళాక అనుకొంటాను” అన్నాను.

“కాదు. షాలినీ ఫైనల్ ఇయర్ లో ఖాళీ దొరికితే మెకానికల్ సెక్షన్ కి వెళ్ళేది. వాళ్ళిద్దరూ ఒకటే కబుర్లు చెప్పుకొనే వాళ్ళు.” వెంకట్ చెప్పాడు.

“వాళ్ళ పెళ్లికి సతీష్ పేరెంట్స్ ఒప్పుకోలేదు. సతీష్ ఇంటి నుండి వచ్చేశాడు.” వాళ్ళ ముగ్గుర్లో ఎవరో అన్నారు.

“పాతికేళ్ళ క్రితం ఒక అగ్ర కులానికి చెందిన అబ్బాయి తల్లిదండ్రులు క్రిస్టియన్ అమ్మాయిని యాక్సెప్ట్ చేయక పోవటం ఆశ్చర్యం కాదు. అయితే అదే కోపం చివరి వరకు షాలినీ పట్ల ఉండటమే కొద్దిగా ఆశ్చర్యం.” మాలో ఎవరిమో అన్నాము.

“అలానే అయి ఉండాలని ఏముంది. కొంతకాలం తరువాత వాళ్ళు మెత్తబడి ఉండొచ్చు. షాలినినే ఆత్మాభిమానంతో దూరంగా ఉండి ఉండవచ్చు. ఇంకా ఏమైనా కూడా అయి ఉండొచ్చు. తెలియని విషయాల పట్ల జడ్జిమెంటల్ గా ఎందుకు ఉండాలి?” అప్పటి దాకా మాట్లాడని మా జూనియర్ ప్రసాద్ అన్నాడు. నిజమేనన్నట్లు మేమెవరం మాట్లాడలేదు.

“మార్కెటింగ్ లో పిహెచ్ డీ చేసిన షాలిని, పిల్లలని పెంచటానికి వర్క్ చేయకుండా ఇంట్లో కూర్చోందట.” నేను కొద్దిగా కోపంగా అంటుండగానే కారు న్యూహాంప్ షైర్ లోని చర్చీలోకి వచ్చేసింది.

అక్కడ పట్టు చీరలో షాలిని. పొద్దున్నే నిద్ర లేచి, వెంటనే మళ్ళీ ప్రశాంతంగా నిద్ర పోయిన 48 ఏళ్ళ షాలిని. జీవితంలో అన్ని ఘర్షణల్ని సవాలుగా తీసుకొన్న షాలినీ, తన మొహంలో ఎప్పుడూ ఉండే బ్రాడ్ స్మైల్ మైనస్ గా బాక్స్ లో పడుకొని ఉంది. పక్కనే తన హైహీల్స్.

“ నా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అప్పుడు వారం రోజులు నాతోనే ఉండి నన్ను బతికించింది.” ఏడ్చి ఉబ్బిన కళ్ళతో గీత.

“బుధవారమే నాతో చాట్ చేసింది” ఉగ్గ పట్టుకొన్న దుఃఖంతో వెంకట్.

“నా కాలు ఆపరేషన్ అప్పుడు ఎంతో సాయం చేసింది” ప్రసాద్

“రెండు రోజుల క్రితం నాకు మైల్ పెట్టింది. జూన్ లో కలుద్దామని” దుర్గ గద్గద స్వరం.

“అయ్యో ఇదెలా జరిగింది? షాలినికి ఇలా ఎలా జరగగలదు?” ప్రపంచం నలుమూలల నుండి దుఃఖ ప్రశ్నార్ధకాలు.

తను పని చేసిన చారిటీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చాలామంది ఆమెను చూడటానికి ఇంకా క్యూలో ఉన్నారు.

ఇంతకూ నేను షాలినీ ఫ్రెండ్ ని కాదు. నా ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ తను యాక్సెప్ట్ చెయ్యలేదు.

(కొంత మంది మనుషులు అంతర్గతంగా మనలో నిద్ర పోతుంటారు. షాలిని విషయాలు దుర్గ  ద్వారా నాకు తెలుస్తూ ఉండేవి. ఆమె మరణ విషయం తెలిసిన తరువాత కలిగిన అలజడి, బాధ ఈ రాతతో  తీరితే బాగుణ్ణు)