ట్యాగులు

karalogo

సమాజ గమనంలోని అంతర సూత్రాలు, దాని పొరల్లోని నిత్యయుద్ధాలను సూక్ష్మంగా గ్రహించగలిగిన వ్యక్తి, తన గ్రహింపును వీలైనంత సరళంగా పాఠకులకు అర్ధం చేయించగలిగితే అతడే జనం గుర్తు పెట్టుకొనే సాహితీకారుడు అవుతాడు. ఇక్కడ రచయిత బతికిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే తప్పు నిర్ధారణ చేసినట్లవుతుంది. ఆ కాలంలో, ఆ ప్రాంతాన్ని ఆవహించిన సంక్షోభాలు, రణాలు అతని వ్యక్తిత్వం మీద, రచనల మీద తప్పక ప్రభావం చూపుతాయి. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కాళీపట్నం రామారావు మాష్టారి సాహితీ ప్రయాణం ఆ పరిమితిని శైశవ దశలోనే దాటి సామాజికోద్రేకాలను అద్దుకొంటూ సాగి, ఆనాడు ఉత్తరాంధ్రలోని కొనసాగుతున్న ఉద్యమాలకు అనుసంధానమయ్యి పరిపక్వతను సంతరించుకొంది.

“మధ్యతరగతి మానసిక రుగ్మతలను ఎక్కువ చేసి చూపించిన” కధలుగా ఆయనే స్వయంగా చెప్పుకొన్న 48-55 మధ్య కధల్లో కూడా అంతర్లీనంగా ప్రాభవం కోల్పోతున్న బ్రాహ్మణ మధ్య తరగతి కుటుంబాల బంధాలను శాసిస్తున్న ఆర్ధిక సంబంధాల విశ్లేషణ ఉంది. ఈ కాలంలో ఈయన రాసిన “పెంచిన మమకారం”, “అభిమానాలు” లాంటి కధలలో ఆయన బీజ రూపంలో తడిమిన అంశాలు తరువాత కాలంలో ఆయన రాసిన కధల్లో వేయి ఊడల మహా వృక్షాల్లాగా విజృంభించాయి.

62-72 మధ్య కాలంలో ఉత్తరాంధ్రలో వచ్చిన ఉడుకు రామారావు గారి కలాన్ని పదును పెట్టినట్లుగా తోస్తుంది. ఉద్యమాలు ఈ కలాన్ని ఆవహించాయా లేక ఇలాంటి కధలు ఉద్యమాలను ఉత్తేజపరిచాయా అన్నంతగా పెనవేసుకొని ఆయన సాహిత్యప్రయాణం సాగినట్లు అనిపిస్తుంది. ఈ కాలంలో ఈయన రాసిన కధల్లో గాఢత బాగా చిక్కబడింది. వ్యక్తి నుండి వ్యవస్థకు ఈయన సాహిత్య ప్రయాణం ఈ కాలంలోనే జరిగింది. ‘ఆదివారం’, ‘చావు’, ‘ఆర్తి’, ‘కుట్ర’, ‘శాంతి’, ‘జీవధార’, ‘భయం’, ‘నో రూమ్’, ‘హింస’ కధలు ఈ కాలంలోనే వెలువడ్డాయి.

రామారావుగారి కధల్లో ఎక్కువ కధల ముగింపులు పరిష్కారాన్ని ప్రత్యక్షంగా సూచించవు. పరిష్కారం చెప్పక పోయినా సమాజంలో ఉన్న దరిద్రం, ఆకలి ఇంకా చాలా సామాజిక రుగ్మతల పట్ల ద్వేషాన్ని కలిగించే పని చేయటం ప్రజా సాహిత్యకారుల కనీస కర్తవ్యం. కధలకు ఉండాల్సిన ఈ సామాజిక ప్రయోజనం కారాగారి చివరి కధల్లో వంద శాతం నెరవేరిందని నిర్ద్వంద్వం గా చెప్పవచ్చు. తమవి కాని జీవితాల్లోకి వెళ్ళి కధను పండించటం అంత చిన్న విషయమేమీ కాదు. రచయితలు డీక్లాసిఫై అవ్వాలని ఆ నాడు విరసం ఇచ్చిన పిలుపును స్వాగతించారు రామారావుగారు.

72 తరువాత ఆయన కధలు రాయటం మానేశారు. (92 లో సంకల్పం కధ రాశారు) ఎందుకు రాయలేదు అన్న ప్రశ్నకు ఒక దగ్గర “వూరికే కధ రాయటం ఎంతసేపు? కానీ ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించుకొంటే అలవోకగా రాయలేక పోతున్నాను” అన్నారు. పదుల్లో గొప్ప కధలు రాసిన వ్యక్తికి కలం సాగక పోవటానికి చాలా సహేతుకమైన సందిగ్ధత ఇది. ప్రయోజనం లేని బఠానీ కధలు రాయలేక పోవటం వలన, వర్తమాన సమాజంలోని రాజకీయ సంక్లిష్టతను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవటం వలన .. ప్రజల కోసం నిజాయితీగా రాయాలనుకొన్న రచయితలు అందరూ ఎక్కడో అక్కడ ఆగిపోయే పరిస్థితే సహజమే అయినప్పటికీ ఈ విరామం సుధీర్ఘం. అయితే ఆయన కాలం కంటే కూడా ముందుకు వెళ్ళి తన చుట్టూ ఆవహించిన సమాజాన్ని అంచనా వేయగలిగారు అనిపిస్తుంది. చూసిన సంఘటనల నుండి తనకు గల స్థిరమైన ప్రాపంచిక దృక్పధం వలన కలిగే చైతన్యం.. ఆ చైతన్యం అంతస్సారంగా స్రవించిన కధలివి. పాత్రల నమూనాల్లోనూ, సంఘటనల్లోనూ, ఆలోచనా రీతుల్లోనూ, వైరుధ్యాల్లోనూ, ఘర్షణలలోనూ ఆయన కలం ఇప్పటి పరిస్థితులకు సారూప్యత ఉన్న సృజనను అందించింది. అది ఆనాటి తరానికే కాదు, ఈ తరం చదువరుల వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా రక్తమాంసాలు ఇచ్చిందని అనటానికి ఏ మాత్రం సందేహించనవసరం లేదు. తరువాత ఇంకొన్ని తరాల రచనల మీద ఈయన ముద్ర గాఢంగా పడింది.

రామారావు గారి కధలకు పరిచయం రాయమని నేను అడిగిన ప్రతి రచయిత, రచయిత్రి వెంటనే సంతోషంగా ఒప్పుకొన్నారు. కాళీపట్నం రామారావు గారి కధలకు ఇప్పుడు మళ్ళీ పరిచయం అవసరమా అనే ప్రశ్న సహజం. ఈ నవంబర్ లో తొంభైయ్యవ పుట్టిన రోజు జరుపుకొంటున్న కా.రా గారి కధలను మళ్ళీ ఒక సారి మననం చేసుకోవడం పాత తరానికి సంతోషకరంగానూ, కొత్త తరానికి ఉపయుక్తంగానూ ఉంటుందని భావిస్తూ ఈ శీర్షిక మొదలు పెడుతున్నాము. నేటికీ సమకాలీనం, సార్వజనీయం అయిన ఈ కధాంశాలను ఈ తరం పాఠకులకు అందించే ముందు సీనియర్ రచయిత(త్రు)లు ‘ఆ పాత మధురాల’ నెమరివేత, కొత్త రచయిత(త్రు)లు కారాగారి తాత్వికతను అర్ధం చేసుకొన్న ఇష్టం.. కలగలిపి పాఠకులకు అందించాలనేదే ఈ ప్రయత్నం.

ఈ శీర్షిక సారంగాలో ఇక్కడ