ట్యాగులు

,

e8ac401fba9ae702b865ffa807d502a3

అవును. ఎలా మర్చిపోయాను? అంతకు ముందు నెల క్రితం ఒక సారి గుర్తుకు తెచ్చుకొని మర్చిపోతానేమో అని భయపడ్డాను. కానీ మర్చిపోతాననుకోలేదు. అలారం పెట్టుకొందామనుకొన్నాను. నా జ్ఞాపక శక్తి మీద నాకే అంత అనుమానమా అనిపించి, అవమానం వేసి మానుకొన్నాను. నీ పుట్టిన రోజుకి ఒక వారం ముందు కూడా నీకేమి కొనిస్తే బాగుంటుంది అని ఆలోచించాను. మార్చి నెల ఆర్ధిక వత్తిడులతో సంశయించాను. ఎలాగైనా విష్ చేయడం మాత్రం మర్చిపోకూడదని ఆ రోజు కూడా గట్టిగా అనుకొన్నాను. రోజూ నీతో మాట్లాడుతూనే వున్నాను. నీ పుట్టిన రోజు నాడు కూడా నీతో మాట్లాడాను. హైదారాబాద్ నుండి నాకు రిటర్న్ టికెట్ బుక్ చేయమని చెప్పి నీతోనే చేయించుకొన్నాను. కానీ నీ పుట్టిన రోజు అని మాత్రం గుర్తు లేదు ఆ రోజు నాకు.

పోనీ. నేను పుట్టిన రోజులకు వ్యతిరేకమా? కానే కాదు. పుట్టినరోజులు మన జీవిత కాలంలో ఒక లాండ్ మార్కులని అనుకొంటాను నేను. ప్రతి లాండ్ మార్కుని ఉత్సవంగా జరపటం కాదు కానీ, ఆ రోజును ఆప్తులు గుర్తించాలనుకొంటాను. నా స్నేహితులు, తెలిసిన వాళ్ళు, బంధువులు వీరందరి పుట్టిన రోజు గుర్తు పెట్టుకొని అభినందనలు చెప్పాలనే అనుకొంటాను. నా పుట్టిన రోజున కూడా నా వాళ్ళందరూ నన్ను గుర్తు చేసుకోవాలని అనుకొంటాను. 80 ఏళ్ళ మా అమ్మ, నా పుట్టిన రోజు ఒక ఏడాది గుర్తు పెట్టుకోలేదని అలిగాను కూడా. అయినా నాకు అత్యంత ప్రియమైన వ్యక్తివి, నీ పుట్టిన రోజుని మాత్రం మర్చిపోయాను.

మనమొక రోజు అనుకొన్నాము. ఆన్ లైన్ లో స్పెల్ కరక్టర్ వచ్చాక స్పెల్లింగ్స్ మర్చిపోతున్నామని. అలాగే ఫేస్ బుక్ లో బర్త్ డే రిమైండర్స్ వచ్చాక జ్ఞాపకశక్తి మొద్దు బారి పోయిందా?

నీకు నేను చెప్పే ఉంటాను .. నాలుగేళ్ళ క్రితం నా మతిమరుపు గురించి. పాలు పొయ్యి మీద పెట్టి ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళిపోతే యింటిగల వాళ్ళతో వచ్చిన తగాదాలు. బండి వేసుకొని ఒక దగ్గరకు వెళదామని బయలుదేరి యింకొక చోటుకి వెళ్ళిపోవడం. అప్పుడు భయపడి డాక్టరు దగ్గరకు వెళ్ళాను కూడా. ఆయన థైరాయిడ్ మొదలైన టెస్టులు చేసి బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ యిచ్చి పంపాడు. ఇంకొక సామాజిక వైద్యుడు “ఇట్స్ ఆల్ ప్రయారిటీస్” అని తేల్చాడు అప్పుడు. “మీ కిష్టమైనవి ఏమైనా మర్చిపోతున్నారా?” అని అడిగాడు. నిజమే అప్పుడు నాకిష్టమైన పాత సినిమా పాటలు .. అవేమీ మర్చిపోలేదు. “ఎక్కువ విషయాలు మన బ్రైన్ లో కిక్కిరిరి ఉన్నప్పుడు ఆ రష్ లో లోపలి వ్యవస్థలన్నీ జిగ్ జాగ్ అయిపోయి, కొన్ని దారులు మర్చిపోతాము.” అని చెప్పాడు. ఆయన వాదన అప్పుడు కొంత కరెక్ట్ అనిపించింది. అలా చూసినా నువ్వే కదా నాకు మిక్కిలి ప్రయారిటీవీ!

మా నాన్నకు ఉన్న మతిమరుపు నాకు వచ్చిందా? ఆయన మా చిన్నప్పుడే, కళ్ళజోడు తల పైకి లాక్కొని మా చేత ఇల్లంతా వెతికించేవాడు. మొన్నా మధ్య నేను ఆయన దగ్గరకు వెళితే ఒక డైరీలో ఏదో రాసుకొంటున్నాడు. ఏమి రాస్తున్నాడో అని చూస్తే పాత సినిమా యాక్టర్ల పేర్లు. పేకేటి శివరాం, కాంచన మాల, సీనియర్ శ్రీరంజని … నుండి ఇప్పటి ప్రకాశం జిల్లా నటుడు వేణు దాకా రాసుకొన్నాడు. (వేణు ఆయన ఫ్రెండ్ కొడుకంట) “ఎందుకిట్లా రాసుకొంటున్నావు?” అని అడిగితే “మర్చిపోతున్నానమ్మాయ్!” అన్నాడు. కొన్నాళ్ళకు మా పేర్లు కూడా ఆ లిస్ట్ లో చేరతాయి అని జోక్ చేశాము కూడా.

వంశపారంపర్యంగా నాకు మతి మరుపు వచ్చి వుంటే నలభై అయిదు ఏళ్ళ అప్పుడు వెళ్ళి కష్టపడి చదివి పరీక్షలు రాశాను. గుర్తు ఉండటం లేదు అని కంప్లైంట్ చేస్తూనే యాభై శాతమైన గుర్తు పెట్టుకొన్నాను కదా. గొంతు మీద కత్తి ఉండటం వలన అయి ఉండచ్చు. నువ్వు నాకు ఎప్పుడూ గొంతులో, గుండెలో చల్లని తీపి రసానివే కదా. అందుకే నిన్ను ఇగ్నోర్ చేశాను.

ఫోన్ లో నా గొంతు మాడ్యులేషన్ ని బట్టి నా స్థితిని ఊహిచగలవు నువ్వు. ఇంతకు ముందు మానసికంగా మొత్తంగా నీ మీద పడిపోయేదాన్ని. వెనక నుండి ఊతపు ప్రేమను వేసి నన్ను నిలబెట్టావు. నువ్వు ఆకురాలు కాలంలో నాకొమ్మకు పూసిన లేతరంగు హరితానివి. ప్రేమరాహిత్య కాలంలో కురిసిన అనురాగ వర్షానివి. బ్రతుకు సంధి వేళలో చిగురించిన చిన్నారి స్నేహానివి. ఈ మధ్య కాలంలో నేను చేస్తున్న అంతర్ బాహ్య యుద్ధాలు చూస్తున్న ఏకైక వ్యక్తివి. ఈ నా సైకాలిజికల్ పాసివ్ నెస్ ని నువ్వూ కొంత మోయాలి తప్పదు. దారులెంచుకొంటున్న ప్రతి సారి బేషరతుగా నాతో నిలిచావు. ఇప్పుడు నా దారి ఎటో నీకు తెలుసు. కంకర రాళ్ళ నుండి నా వేర్లు లాక్కొని మెత్తటి మట్టిలో పాతుకొన్నాను. ఆరోగ్యపు, బలమైన కొమ్మలు మొలిచే కాలం ఇది. నీ మెత్తటి హృదయంతో నన్ను హత్తుకో. నీ అవధులు లేని స్నేహపు సాహచర్యంతో నన్ను కాయలు, పువ్వులు వెయ్యనివ్వు.