ట్యాగులు

Gogu+pp

తొలి వాన పడి తడిచిన నేల వినూత్నంగా ఘుమాయిస్తుంది. ఎందుకంటే ఆ నేలలో అప్పటివరకు గోప్యంగా ఎండిపోయి ఉన్న అనేకానేక ఖనిజాలు, లవణాలు, రసాయనాలు, వాయువులు వానతో ఒక్కసారిగా బయటకు పొంగి సువాసనలు వెదజల్లుతాయి. పాత ఆకులు రాలి కొత్త చిగుర్లు వేసే వసంతకాలంలో చెట్లు పచ్చగానే కాకుండా పలు వన్నెలతో అలరిస్తాయి. ఎందుకంటే తల్లిగర్భం నుండి తోసుకొని వచ్చినా, మానును చీల్చుకొని వచ్చినా, భూమిని తొలుచుకొని వచ్చినా ప్రతి నూతన జననం అందమైనది. అందులోని వైవిధ్యం సౌందర్యవంతమైనది. అలాంటి వైవిధ్యాలు ఇప్పుడు సాహితీ ప్రపంచంలో పుట్టి దానికి సొబగులు అద్దుతున్నాయి. నేలలో వేళ్ళు పాతుకొని దానిని వదలక భూమిని అంటి పెట్టుకొనే గరికపూలు వికసిస్తున్నాయి. ‘మట్టిపూలు’ బహు అందంగా ఇప్పుడు పూస్తున్నాయి.

Joopaka_Subhadra

సాహిత్యాన్ని పోషించేవారు రాజులు అయినంత కాలం వారి చరిత్రే ప్రక్షిప్తం అయ్యింది. రాసినది పురుషులు అయినంత కాలం వారి వాహికలే వినిపించాయి. స్త్రీవాదం ముందుకు వచ్చి గొంతు విప్పాక కూడా ఆ గొంతులనుండి పరిమిత శబ్ధమే వచ్చింది. విస్తృత స్త్రీ ప్రపంచానికి ఆ గొంతులు విస్తరించలేక పోయాయి. కారణం మళ్ళీ అదే. ఎవరి గురించి వాళ్ళే మాట్లాడగలుగుతున్నారు. విద్య, సాహిత్యం, సంస్కారం – తొలుత ఏ కులీన స్త్రీలను వరించాయో వారి వ్యక్తీకరణలే ముందుగా వెలుగు చూశాయి. అయితే ప్రతి చోటా మినహాయింపులు ఉంటాయి. అది వేరే విషయం. అయితే ఈ అగ్ర వర్ణ, అగ్ర వర్గ, మధ్య తరగతి వ్యక్తీకరణలు ఆ కాలానికి అభ్యుదయకరమైనవే. గురజాడ బాల్య వివాహాల గురించి, కన్యా శుల్కం గురించి రాసి ఆ కాలంలో గొప్ప సాహితీ విప్లవం తెచ్చినట్టే ఇవి కూడా.

New House 043

ఇది అస్తిత్వ ఉద్యమాల కాలం. సమూహాలుగా చైతన్యవంతం అవుతున్నారు. హక్కుల స్పృహ కలుగుతున్నది. మెజారిటీగా ఉన్న అణగారిన కులాల మహిళల గురించి ఎవరూ పట్టించుకోలేదు., ఆ వర్గపు పురుషులతో సహా. ఇప్పుడా వంచబడ్డ తలలు లేస్తున్నాయి. నొక్కి వేయబడ్డ కేకలు పిక్కటిల్లుతున్నాయి. ఆత్మగౌరవ యుద్ధాలు స్త్రీ ఆత్మతో అక్షరబద్ధం అవుతున్నాయి. శ్రమ చేసి వెలువడిన చెమట కలంలో సిరాగా మారి కొత్త రాతలు రాస్తున్నది. వాస్తవం ఆ రాతకు శిల్పం. తరతరాల పీడన వస్తువు. బొంగురు గొంతుల గద్దరు పాటలాగే ఈ రాతలు జన బాహుళ్యంలోకి చొచ్చుకొని పోతున్నాయి.

shajahana

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రచయిత్రుల వేదిక మట్టి పూలు’ ఒక అనివార్య సామాజిక అవసరంగా ఆవిర్భవించింది. ఈ ఆవిర్భావ సదస్సు 2009 మార్చి 22న జరిగింది. కొలకలూరి స్వరూప రాణి, డా. విజయ భారతి, ప్రొ. జయాసలోమి, జమీల నిషాత్, కె. వరలక్ష్మి, పుట్ల హేమలత, గోగు శ్యామల, నాగమ్మ ఫూలే, మందరపు హైమవతి, జ్వలిత, డా. వినోదిని, కొలకలూరి మధుజ్యోతి, డా. చల్లపల్లి స్వరూపరాణి వక్తలుగా మాట్లాడారు. యాభై మందికి పైనే దళిత, బహుజన, మైనారిటీ రచయిత్రులు పాల్గొన్నారు.nakhab

“ఒక కప్పు క్రింద ఉన్న మగవాళ్ళ పట్లనే మన హక్కుల్ని స్పష్టంగా నిర్దిష్టంగా మాట్లాడుకుంటున్నపుడు .. కులం కాని, అంటబడని స్త్రీలుగా ఈ సమాజంలో మా హక్కుల్ని స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మావి ఓడించబడిన చరిత్రలు. మా ఆవేదనలు, ఆనందాలు ఏ సమాజాలూ రికార్డ్ చేయలేదు. స్త్రీల సాహిత్యమంటే ఆధిపత్య కులాల స్త్రీల సాహిత్యాన్నే పరిగణనలోకి తీసుకోవడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్త్రీల సాహిత్యం ఉనికిని గుర్తించడానికే నిరాకరించడం జరుగుతున్నది. సాహిత్య ఉద్యమాల గుర్తింపులో మమ్మల్ని కలుపుకున్నట్లే కనిపిస్తుంది కానీ మా అస్తిత్వాలు, హక్కులు, మా చర్చలు ఎజండాల్లో కనిపించవు. నిర్ణయాధికారాలు మావి కావు” అంటున్నారు ఈ వేదిక రచయిత్రులు.

vinodiniఅట్టడుగు స్త్రీల ప్రతినిధులుగా ఈ రచయిత్రుల ఆవేదన, అభిశంసన సహేతుకమైనవే. ఇప్పటివరకు ఈ సమూహపు స్త్రీల గురించి వచ్చిన రచనలు తక్కువే. సహానుభూతితో రాసిన పదాలకు ఉండాల్సినంత గాఢత ఉండదు. ఉద్యమ అనుభవాలుగా రాసిన రాతలు ఒక కార్యాచరణకు ఉపయుక్తం అవుతాయి కానీ వ్యక్తీకరణలో పూర్తి న్యాయం జరగదు. సొంత అనుభవం ఒక కథగానో, కవితగానో మారినపుడు నికార్సైన రూపంతో ప్రజ్వలిస్తుంది.

Nalla+Podduఅట్టడుగున ఉన్న సామాజిక వర్గాల స్త్రీలు .. డక్కలి, చిందు, బైండ్ల, ముష్టి, బుడజంగాలు, మొండి, బండ, రెల్లి, తోటి, మెహతర్, మోచి, బుడబుక్కలు, కాటి పాపలు, గంగిరెద్దులోల్లు, కాటి కాపలోల్లు, పిట్టలోల్లు, ఎరుకలు, మందులోల్లు, యానాదులు, చెంచులు, కోయ, గోండు, లంబాడీ, బోరేవాలాలు, పత్తర్ షోడ్ లు, దూదేకులు, బుక్కా ఫకీర్ లు .. వీరి బతుకు చిత్రాలను సాహితీ చరిత్రకు ముఖచిత్రం చేసే కర్తవ్యాన్ని తీసుకొన్న ఈ ‘మట్టి పూల’ను అభినందించాలి. 90లలో వచ్చిన ‘ఎల్లి’, ‘నీలి’ లాంటి కొన్ని నవలికలు, మరికొన్ని కథలు తప్ప ఈ సామాజిక వర్గాల స్త్రీల గురించి ఆధునిక సాహిత్యంలో ఎక్కడా రాయబడలేదు. ఈ నిశ్శబ్ధాన్ని తమ అక్షరాలతో శబ్దీకరిస్తామని వీరు అంటున్నారు.

RayakkaManyam600‘మట్టిపూలు’ రచయిత్రులు జెండర్ కన్నాకులం బలమైనదని అంటున్నారు. జెండర్ పరంగా ఉండే వివక్ష తమ సమూహాలలో ఉన్నప్పటికీ కులమే తమను ఎక్కువ బాధిస్తుందని అంటున్నారు. వారు సృష్టించబోతున్న ప్రత్యామ్నాయ సాహిత్యం కులాన్ని, మతాన్నికేంద్ర బిందువుగా చేసుకొని స్త్రీ గొంతుతో వస్తుందని చెబుతున్నారు. వర్గాన్ని వదిలేసి స్త్రీవాదం కేవలం జెండర్ ను పట్టుకొని వేలాడుతుంటే కలిగే చికాకు అనుభవమయిన ఈ మట్టిపూల రచయిత్రులు ఆ తప్పును కులం విషయంలో చేయరని ఆశిద్దాము. అణచివేయబడ్డ కులాల, మతాలలోని ‘శ్రామిక మహిళలకే’ వీరి రచనలలో ప్రాతినిధ్యం వహిస్తారని మాతృక అభిలషిస్తున్నది. ‘మట్టిపూలకు’ మనఃపూర్వక అభినందనలు తెలుపుతున్నది.