ట్యాగులు

, ,

naanna

యాభై ఏళ్ల కూతురికి నాన్నతో ఎలాంటి అనుబంధం ఉంటుంది? సొంత కుటుంబం, సొంత జీవితం, సొంత సరదాలు, సొంత స్నేహితులు, సొంత తాత్విక చింతన ఏర్పాడ్డాక? కనీసం నువ్వూ నేనూ కలిసి కూర్చొని ఆలోచించటానికి ఏముంటాయి? నీ ఎదురుగా కూర్చొని నా ఆలోచనా ప్రవాహంలో నేను కొట్టుకొని పోవటం తప్ప. ‘ఒక్క సారి వచ్చి పో’ అని మూడో లైను నుండి నువ్వు ఫోన్ చేసినపుడు ఏడో లైన్ లో ఉన్న నేను కదలక పోవటానికి అదే కారణమా?

అప్పటికీ నువ్వు నాకు ఆసక్తి కలిగించే విషయాలు మాట్లాడటానికే ప్రయత్నిస్తావు. పిల్లల చదువులు, నా ఆహారపు అలవాట్లు, వాకింగ్ ఇవన్నీ ఇదివరకిటిలా నాకు ఇష్టంగా ఉండటం లేదని నీకు తెలియదు. లౌకిక విషయాల కతీతంగా ఈ మధ్య నేను జీవిస్తున్నానని నీకు నేను చెప్పలేదు. ఎందుకంటే నాకే ఆ విషయం తెలియదు కాబట్టి. చిన్నప్పుడు నువ్వు మంచం మీద పడుకొని ఇంగ్లీషు పాఠం చెబుతుంటే నీ తల దగ్గర చేరి నీ వెండ్రుకలను సవరిస్తూ వాటితో సావాసం చేసిన చిన్నపిల్లనా యింకా? కోచింగు కోసం గుంటూరు వీధుల్లో నీ వెంబడబడి తిరిగిన టీనేజర్ నా? ఇంజినీరింగ్ సీట్ వచ్చిందని నువ్వు నాకు కొనిపించిన ఆల్విన్ వాచ్ ఆ మధ్యే చెడిపోయింది. బబ్లూ పుట్టాక నువ్వు కొనిచ్చిన విమల్ చీర పాడై పోయింది. ప్రేమ అంటూ పెళ్లి అంటూ నీ గుండె గుభేల్ మనిపించాను మర్చిపోయావా? నీలో పుట్టిన కణాన్ని. అమీబాలాగా నీ నుండి విడివడి అనేక రూపాలు మార్చుకొని స్థిరాకారానికి వచ్చాక మళ్ళీ నీ మనసులో చేరటం సాధ్యమా?

తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించటం ప్రకృతి ధర్మం. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించటం సామాజిక ధర్మం. ప్రేమ, అనుబంధం, వారు పోయినపుడు కలిగే శోకం ఆ ధర్మాలకనుగుణంగానే ఉంటాయి అని నేను థియరీ తీసి మాట్లాడినపుడు నువ్వు ఏమనుకొన్నావో తెలియదు కానీ బాధపడి మాత్రం ఉండవు. ఎందుకంటే నీ రేషనల్ థింకింగ్ నాకు వచ్చిందని నీకు నాకంటే బాగా తెలుసు. ‘నాకు కుటుంబ బాంధవ్యాల కంటే ఎక్కువైనవి వేరే ఉన్నాయి.’ అని నేను అన్నప్పుడు ఏమనుకొన్నావు?

అయినా నన్ను నీ దగ్గరకు రప్పించుకోవటానికి చాలా ప్లాన్స్ వేశావు. న్యూరోపతీ చూపించుకోవటానికి గుంటూరు తీసుకొని వెళ్ళమన్నావు. అక్కడ నీ బాల్య స్నేహితురాలని చూడాలని పట్టుబట్టి ఎండలో నువ్వు ఎక్కి దిగిన గడపలు, ఆమెను నువ్వు పట్టుకోగానే నీ ముఖంలో సంతోషం గురించి మాత్రం చాలా మందికి చెప్పాను. ఫిజియోథెరపీ చేయించుకోవాలని నన్ను రోజూ రిమ్స్ కు తిప్పావు. ‘నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండాలి’ అని చెప్పానని కార్ రివర్స్ చేసే లోపల చొక్కా వేసుకొని దిగి వచ్చి కారులో గుండీలు పెట్టుకొన్నావు. కొలీగ్ పెళ్లి వంక పెట్టి నువ్వు పని చేసిన పల్లెటూళ్ళు నేను తిప్పినపుడు ఆనందపడ్డావు.

హిందూ పేపర్ చదవలేక పోతున్నావని మానిపించినపుడు ముసలాడివి అయ్యావని ఎగతాళి చేశాను. చేస్తున్న పనులు చాలా స్లో అయినపుడు విసుక్కొన్నాను. వినబడక పెద్దగా మాట్లాడమని అడిగినపుడు నవ్వాను. అయితే నిల్చోన్న నువ్వు ఒక్కసారి పడిపోయావు అని తెలిసినపుడు నీ గుండె బలహీనపడిపోయిందని మాత్రం తెలుసుకోలేదు. ఒట్టు.

“అక్కా నాన్నకు కొద్దిగా బాగాలేదు. మనం కర్నూల్ వెళ్లాల్సి ఉంటుంది”

“అవసరం లేదు. వాళ్ళే వచ్చేస్తున్నారు. నువ్వు మూడో లైన్ కి రా”

“గుండెజబ్బుతో ఎనభై మూడు ఏళ్ళు బతికాడు. దర్జాగా వెళ్లిపోయాడు. నిండు జీవితం”

నిన్ను దించగానే నోట్లో ఆ చొంగ ఏమిటి? పేపర్ చదువుతూ, నిద్ర పోతూ నువ్వు కార్చిన చొంగ కాదా అది. నా చీర కొంగుతో శుభ్రంగా తుడుచుకొన్నాను. పెద్దక్క ఒక పక్క గుండెలవిసేలా ఏడుస్తుంది. చిన్నక్క అనాధను ఆయ్యానని కుళ్ళి పోతుంది. అమెరికా నుండి వచ్చిన తమ్ముడు పసిపాపలాగా రోదిస్తున్నాడు. అరవై ఏళ్ళు నీతో జీవిత సాహచర్యం చేసిన నీ భార్య, మా అమ్మ ‘ పిల్లలు ఏడుస్తున్నారు. లేయ్యా!’ అని నిన్ను బతిమాలాడుతుంది.

‘అవునండి. నాన్న చనిపోయారు. 3న దహనం’ అందరికీ ఫోన్లు చేస్తున్నాను.

‘మా నాన్న అరవై ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకొన్నారు. ఆడపిల్లలని చూడకుండా మమ్మల్ని చదివించారు.’ వచ్చిన వాళ్ళకు చెబుతున్నాను.

‘13న పెద్ద కర్మ. మాధవరావుగారు మీరు రావాలి. అంకమ్మగారు మీరు ఆఖరి చూపుకి అందుకోలేదు. తప్పక రండి.’

మధ్యలో మాతృక వర్క్ షాప్. వెళ్ళాక పోతే ఎలా! చాలా ముఖ్యం. వెళ్ళాలి.

అంతా బాగా జరిగింది. రిటర్న్ గిఫ్టులు అందని వాళ్ళను గుర్తుకు తెచ్చుకొని పంచటం కూడా అయిపోయింది. ఒక ముఖ్యమైన విషయంలో నా ఉద్వేగాలను కంప్యూటర్ మీద  పెట్టి పత్రికకు కూడా పంపాను.

ఇప్పుడు అమ్మా, నేను మిగిలాము. ఈ క్షణం రాకూడదని అనుకొన్నాను నాన్న. అమ్మను నేను ఒంటరిగా ఓదార్చలేను. కంటికొసలలో, గుండె నుండి గొంతు వరకు ఉన్న వాహికలో కోరి ఘనీభవించుకొన్న దుఃఖం బయటకు వస్తేనే అది సాధ్యం. అప్పుడు అమ్మ తన దుఃఖం మర్చిపోయి నన్ను ఓదారుస్తుంది. నాకు అది ఇష్టం లేదు. బతికినంత కాలం దాన్ని మోయటమే నాకు ఇష్టం. చివుక్కున లేచి బయటకు వచ్చేశాను. ఈ ఒక్కపని నేను నీలా రేషనల్ గా చేయలేదు.