ట్యాగులు

, , , , ,

13tea4cut

తలకు రంగు రంగుల వస్త్రాలు కట్టుకొని, వెనుక వెదురు బుట్టలు కట్టుకొని ఏటవాలుగా పెరిగిన టీతోటల్లో నవ్వుతూ తుళ్ళుతూ టీ ఆకుల్ని తుంచే మహిళలను సినిమాల్లో చూస్తుంటాము. అందమైన ప్రకృతికి మహిళలు ఇంకొంత అందాన్ని జోడించినట్లుగా కన్నులవిందుగా ఉంటాయా దృశ్యాలు. కానీ ఆ స్త్రీల వెనకాల అగాధమైన బాధలు ఉంటాయి. అంతులేని లౌకిక వేదనలు ఉంటాయి. వ్యాపారాత్మక సినిమాలు అవేమీ పట్టించుకోవు. సినిమాలు ఆ స్త్రీలను వారి అందమైన రంగుల దృశ్యాల చిత్రణకు పనుముట్టులుగానే చూస్తాయి. వీరి సినిమాలలో వెన్నెముక లేని స్త్రీలు హీరోయిన్ల పేరుతో అలంకారప్రాయంగా కనబడుతుంటారు. ఇలాంటి కృత్రిమ చిత్రీకరణలను వెక్కిరిస్తూ గొప్ప జీవన పోరాటాన్ని చేశారు ఈ టీ తోట మహిళలు. ఆ పోరాటంలోని నిజ సౌందర్యాన్ని చూడగలిగిన వాళ్ళు అద్భుతమైన సినిమాలు తీయవచ్చు. దురదృష్టవశాత్తు యిప్పటి సినిమా వ్యాపారాన్ని తప్ప వాస్తవికతను ఆశ్రయించటం లేదు.

కేరళ రాష్ట్రంలోని మున్నార్ కొండప్రాంతం టీ తోటల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. పశ్చిమ కనుమల్లోని ఈ ఎత్తైన కొండలు టీ మొక్కల పెరుగుదలకు అనువైన చల్లని వాతావరణాన్ని, నీళ్ళు నిలువ ఉండకుండా జారిపోవటానికి అవసరమైన కొండవాలును యివ్వగలవు. బ్రిటీషు వాళ్ళు భారతదేశంలో ప్రవేశించిన తరువాత వాళ్ళ ప్రాంతాల నుండి టీ మొక్కలను తెచ్చి ఇక్కడ టీ ఎస్టేటులను స్థాపించారు. ఇప్పుడు అక్కడ పెరుగుతున్న టీ మొక్కలకు వందేళ్ళ పైగా వయసు ఉంటుంది. ఇంచుమించు అదే వయసు ఈ తోటల్లో పని చేస్తున్న మహిళల చెమటకు కూడా ఉంది. ఈ టీ తోటల పాలనకు ఇక్కడ పని చేస్తున్న వేలాది మహిళలు తమ అంతులేని శ్రమను ధారబోశారు. బ్రిటీషు యజమానులు ఆ రోజుల్లో పశ్చిమ తమిళనాడు నుండి కూలీలను ఈ తోటల కోసం తెచ్చుకొన్నారు. వాళ్ళు కాకుండా ‘కదార్’ అనే ఆదివాసీ తెగల నుండి కూడా స్త్రీ పురుషులు ఈ తోటల్లో పని చేస్తున్నారు. బ్రిటీషు వాళ్ళు భారతదేశాన్ని వదిలేశాక దేశీయ కంపెనీలు ఈ టీ తోటలను కొనుక్కొన్నాయి.

ఇదంతా వినడానికి బాగుంది. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఈ తోటల్లో వేలల్లో స్త్రీలు పని చేస్తుంటారు. ఇక్కడ అతి పెద్దదైన టీ కంపెనీ కెడీహెచ్ పి (కణ్ణన్ దేవన్ హిల్ ప్లాంటేషన్) లోనే పదివేలకు పైగా మహిళలు పని చేస్తున్నారు. ఇది టాటా కంపనీకి చెందినది. నెహ్రూ మార్కు సోషలిజం పని చేసిందేమో మరి, ఇక్కడ పని చేసే వర్కర్లకు కూడా ఈ లాభాల్లో భాగస్వామ్యం కల్పించారు. అందుకే ఈ శ్రామికులను వర్కర్లు అనకుండా ఉద్యోగస్తులు అంటారు. వీరికిచ్చిన లాభాల భాగస్వామ్యం ఈ టీ తోటలను వారి సొంతంగా భావించి వళ్ళొంచి కష్టపడటానికే పనికి వచ్చింది కానీ ఇంకెందుకూ పనికి రాలేదు. కాలం గడిచేకొలది ఈ కూలీలకు మిగిలింది కేవలం మూడు వందల షేర్లు మాత్రమే. ఒక్కో షేరు విలువ పది రూపాయలు మాత్రమే. షేర్లు అన్నీ కంపెనీ ఉద్యోగస్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వర్కర్లకు మిగిలింది రోజుకు 229 రూపాయల కూలి మాత్రమే. సంవత్సరానికి ఒకసారి యిచ్చే ఇరవై శాతం బోనస్సు కూడా ఐదు సంవత్సరాలుగా వీరికి అందటం లేదు. కూలి పెంచమని అడిగిన ప్రతిసారి బీహార్ నుండి, పశ్చిమ బెంగాల్ నుండి తాత్కాలిక వర్కర్లను వీరికి పోటీగా దించేవాళ్లు. ఆకాశానంటుతున్నధరలు. పెరగని నిజవేతనాలు.

అగ్గి బద్దలు అయ్యింది. ఆడవాళ్లు టీ ఆకులను వదిలేసి వీధుల్లోకొచ్చారు. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలకు ఆకుపచ్చని తోటల నిండా మహిళలు చీమల మాదిరి లైన్లు కట్టి ఆకులు గిల్లుతూ, ట్రక్కులకు పోస్తూ ఉండేవాళ్లు. కానీ ఈ సంవత్సరం తోటలు ఖాళీ అయ్యాయి. మహిళలందరు ‘టీ పట్టణం’గా పిలిచే ‘మున్నార్’ పర్యాటక ప్రాంతాన్ని స్తంభింపచేశారు. తోటలనుండి కొన్ని కిలో మీటర్ల వరకు రోడ్లను బ్లాక్ చేశారు. పది రోజుల పాటు పనులు ఆగిపోయాయి. కెడీహెచ్ పి లో ప్రారంభం అయిన ఈ ఆందోళనలో షుమారు అయిదువేలమంది మహిళలు పాల్గొన్నారు. వారిలో చాలా మంది వయస్సు యాభైలలో ఉంది. మూడు తరాలుగా వీళ్ళ కుటుంబీకులు టీ తోటలమీదనే బతుకుతున్నారు. రోజుకు ఇరవై కేజీల ఆకులు గిల్లే ఈ మహిళలలు ‘కార్పెంటర్ల కంటే మాకు తక్కువ వేతనాలు ఇస్తున్నారు’ అని ఆగ్రహించారు. రోజుకు ఐదువందల వేతనం యివ్వాలని, బోనస్ ఇరవై శాతం వెంటనే చెల్లించాలని వీరి డిమాండుతో పోరాటానికి దిగారు.

వేతనాల పెంపు కోసం జరిగిన ఈ ఆందోళన చాలా ప్రత్యేకతలతో నడిచింది. మహిళా శ్రామికులు రోడ్లు పట్టకముందే ఇక్కడ పనిచేస్తున్న సిఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ లాంటి ట్రేడ్ యూనియన్లు యాజమాన్యంతో చర్చలు నడిపి పది శాతం బోనస్సుకు ఒప్పుకొని వచ్చారు. ఈ అగ్రిమెంటుకు మహిళలు అంగీకరిచలేదు. ట్రేడ్ యూనియన్లను మహిళలు బహిష్కరించి వాళ్ళ స్వయం నాయకత్వంలో నిరసనకు దిగారు. ట్రేడ్ యూనియన్ ఆఫీసుల మీద దాడి చేశారు. నాయకులు దాక్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. స్థానిక బీజేపీ పార్టీ వీరికి మద్దతుగా ఇడుక్కీ జిల్లాలో బంద్ నిర్వహించినా కూడా వారిని దగ్గరకు రానివ్వలేదు ఈ మహిళలు. ఉద్యమం ఊపులో ఉన్నప్పుడు ప్రధాన అధికార పార్టీలు అయిన కాంగ్రెస్స్, సిపిఐ(ఎం) వారి మహిళా మంత్రులను ఈ ఆందోళనకారులకు సానుభూతి చూపటానికి పంపించాయి. ‘సానుభూతి చూపటం కాదు, మీరూ మాతో చివరి వరకూ కూర్చోండని’ మహిళలు డిమాండ్ చేసి వారిని కూర్చోబెట్టేశారు. ‘స్పష్టమైన నాయకత్వం లేకుండా ఆందోళన విజయవంతం కాదు’ అంటున్న రాజకీయ పార్టీల సన్నాయి నొక్కులను కూడా ఈ మహిళలు పట్టించుకోలేదు. మున్నార్ పట్టణాన్ని స్తంభింపచేశారు. కెడీహెచ్ పి అధికారులను గృహ నిర్భంధానికి గురి చేశారు. ఇంకో విశేషమేమిటంటే ఈ మహిళలు తమ తోటి మగవారిని కూడా ఆందోళనలోకి రానివ్వలేదు. ‘తాగుడు మగవాళ్ళను ప్రలోభాలకు గురి చేస్తుందని’ వారి అభిప్రాయం. కెడీహెచ్ పి యాజమాన్యం తన బాధను ఇంకో విధంగా చెబుతుంది. అంతర్జాతీయ మార్కెట్టులో టీ ధర తగ్గటం వలన తమ లాభాలు పడిపోయాయంట. వర్కర్సుకు బోనస్సు తగ్గించే ట్రేడ్ యూనియన్లతో ‘సంప్రదించే’ చేశారట.

ఎట్టకేలకు పది రోజుల ఉద్యమం తరువాత టీ తోట మహిళలు గెలిచారు. మహిళా నాయకులు సుందర వల్లి, వనరాణి, లిస్సీ, సంగీత, ఆంటోనీ రాజులను పోలీసు భద్రతతో కొచ్చీ తీసుకొని వెళ్లారు. ట్రేడ్ యూనియన్ నాయకుల సమక్షంలో సాక్షాత్తు కేరళ ముఖ్యమంత్రి పాల్గొని ఈ ఒప్పందాన్ని మహిళలకు వినిపించారు. ఇరవై శాతం బోనస్సుకు యాజమాన్యం ఒప్పుకొన్నది. వేతన సవరణ సెప్టెంబర్ 26 లోపల చేస్తామని ప్రకటించింది. ప్లాంటేషన్ లేబర్ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తామని వాగ్ధానం చేసింది. ఈ విజయం ఈ ప్రాతంలోని ఇంకా కొన్ని ప్లాంటేషన్లలోని మహిళలను ఉద్యమాలకు ప్రేరణ యిస్తుంది. హరిసన్ మలయాళం లిమిటెడ్ ఇప్పటికే స్ట్రైక్ మొదలు పెట్టింది. ఈ సారి అనివార్యంగా ట్రేడ్ యూనియన్లు వారికి సపోర్టుగా నిలవాల్సి వచ్చింది. 30,000 మంది వర్కర్లు ఉన్న పాలఘాట్ జిల్లాలోని నేల్లంపతి టీ ప్లాంటేషన్ లో మహిళలు ఇప్పటికే కదిలారు.

రాజకీయ పార్టీలే ప్రజలను కదిలించలేని పరిస్థితుల్లో ఈ విజయం సామాన్యమైనది కాదు. ప్రధాన స్రవంతి పార్టీలు వీరి ఆగ్రహాన్ని, అసంతృప్తిని పట్టించుకోవాల్సి వచ్చింది. తమ ఆత్మ గర్వాన్ని దిగమింగుకొని వీరికి మద్దతు యివాల్సి వచ్చింది. ఎప్పుడూ నాయకత్వం వహించని మహిళలు శ్రామిక వర్గాలను నడిపించారు. ఆడవాళ్ళు కోరిన విధంగా ట్రేడ్ యూనియన్ల నాయకులు సంతకాలు పెట్టాల్సి వచ్చింది. ఒక రకంగా ట్రేడ్ యూనియన్ల కోరలు ఈ మహిళలు పీకేశారు. వాటి పితృస్వామిక స్వభావాన్ని బట్టబయలు చేశారు. ఈ మధ్య కాలంలో కేరళలో జరిగిన అనేక మహిళా కార్మిక ఉద్యమాలలో ట్రేడ్ యూనియన్లు నామ మాత్రంగానే పాల్గొన్నాయి. బట్టల దుకాణాలలో నేలను ఊడ్చే వాళ్ళు సరైన పని వేళలకోసం చేసిన ఆందోళన, ప్రైవేటు హాస్పిటల్స్ లో పని చేసే నర్సులు న్యాయమైన వేతనాలకోసం చేసిన ఉద్యమం, అసంఘటిత రంగంలో పని చేసే మహిళలు పని వేళల్లో కూర్చోనే హక్కు కోసం చేసిన పోరాటం .. యివన్నీ ట్రేడ్ యూనియన్లకు అతీతంగా విజయం సాధించాయి. ఈ ఉద్యమాల నుండి కొత్త మహిళా నాయకులు ఆవిర్భవిస్తున్నారు. వీరు మహిళ వర్కర్ల సమస్యల పట్ల ట్రేడ్ యూనియన్లు సెంసిటివ్ గా లేవని ఆరోపిస్తున్నారు. ట్రేడ్ యూనియన్ల నాయకులు ఈ ఆరోపణలను చెవి ఒగ్గి విని పట్టించుకోవాలి.

అక్షరాస్యతలో కేరళ మహిళలు ముందు ఉంటారు. ప్రసవకాల మరణాలు కూడా ఇక్కడ తక్కువ. కానీ వేతనాలు, శ్రామికశక్తిలో వంతు, రాజకీయాలలో పాత్ర,, నేరాలు… మొదలైన జెండర్ సూచికలలో మహిళలు వెనకబడే ఉన్నారు. పెద్ద ఎత్తున బ్రతుకు తెరువు కోసం మహిళలు ఉద్యమాలు చేస్తున్న ఈ సందర్భంలో కూడా కేరళ అసెంబ్లీలో కేవలం ఏడుగురు మహిళలే ఉన్నారు.

మహిళావర్కర్లు అత్యధికంగా ఉన్నఆస్టి, జె ఎన్ ఎస్, గుర్గావ్ బెల్ట్ లో ఉన్న బక్ష్టర్, బంగ్లాదేశ్ లో ఉన్న బట్టల పరిశ్రమలు .. యిలాంటి మిలటరీ పోరాటాలకు దిగే సమయం ఆసన్నమయింది. పరిష్కారాల పట్ల రాజీ లేని రాజకీయ దృక్పధం, నిజాయితీ కూడిన ఆచరణ, సమాజ కుటుంబాల పట్ల బాధ్యత మొదలైన విషయాలు మహిళలను మంచి నాయకులుగా తయారు చేస్తాయని ఈ టీ తోట మహిళలు లోకానికి చెబుతున్నారు.

(ఇక ఇప్పుడు దినవారీ కూలి పెంపు కోసం వీరి రెండో ఉద్యమం ప్రారంభం అయ్యింది)