ట్యాగులు

, , , , , , , , , , , , , ,

గాలియా నార్మెట్

గాలియా నార్మెట్

మధ్య ప్రాచ్యంలో బహు మతాల, బహుళ జాతుల ప్రజాస్వామ్యం ప్రాతిపదికన ఏర్పడిన ప్రాంతం ‘రొజావా’. సిరియా దేశపు ఉత్తర భాగాన ఉన్న ఈ ప్రాంత ప్రజలు, ప్రధానంగా కుర్ధులు, ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్)కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ స్వయం ప్రతిపత్తి ప్రకటించుకొన్నారు. కుర్దులు ముస్లిము మతానికి సంబంధించిన ఒక జాతి ప్రజలు. ఎన్నో ఏండ్లగా వారు అస్తిత్వం కోసం పోరాటాలు చేస్తున్నారు. ఒట్టోమాన్ సామ్రాజ్యం కూలి పోయాక టర్కీ, ఇరాన్, ఇరాక్, సిరియా దేశాలలో వీరు విడిపోయి బతకాల్సి వచ్చింది. తమకు సొంత నేల కావాలని అన్ని దేశాలలో ఉన్న కుర్డులు దేశభక్త ఉద్యమాలు చేస్తున్నారు. వీరికి సొంత భాష, నాగరికత, వస్త్ర ధారణ, జానపదాలు, పేర్లూ ఉన్నప్పటికీ ఆయా దేశాల అధికారాల కింద వాటిని కోల్పోయి బతకాల్సి వస్తుంది. 1970 తరువాత కుర్ధిష్ నేషనలిజం మార్కిష్టు రూపం తీసుకొన్నది. అంతకు ముందు ఉన్న స్థానిక, సాంప్రదాయక, ఫ్యూడల్ నాయకత్వానికి భిన్నంగా ప్రగతిశీల ఆలోచనలు వీరిలో వేళ్లూనుకొన్నాయి. టర్కీప్రభుత్వం కుర్డుల రాజకీయ చలనాన్ని ‘టెర్రరిజం’ కింద పరిగణిస్తుంది. ఇరాక్ లో కుర్డుల జాతీయ కాంక్షను ఒక సాకుగా తీసుకొని అమెరికా సద్దాంను తొలిగించిన తరువాత కొన్ని అధికారాలు కుర్ధులకు లభించినప్పటికీ ఇప్పటికీ వారికి పూర్తి స్వాతంత్ర్యం రాలేదు. ఇరాన్లో కుర్ధులు వామపక్షాలతో జతకట్టారు.

రొజావా భూభాగం

రొజావా భూభాగం

ఉత్తర సిరియాలో కుర్ధులు నివసించే ఉత్తర భాగానికి ‘రొజావా’ అని పేరు పెట్టుకొన్నారు. ‘రొజావా’ అంటే పశ్చిమం అని అర్ధం. అన్ని దేశాలలో ఉన్న కుర్ధులు కోరుకొంటున్న మహా కుర్ధిస్తాన్ భూభాగంలో చూస్తే ఈ భాగం పశ్చిమంగా ఉంది. ప్రత్యేక ప్రజాస్వామ్యం, జండర్ సమానత్వం, సుస్థిరత అనే మూడు సూత్రాల ఆధారంగా తన సమాజాన్ని నిర్మించుకొన్నది. ఇప్పుడు ఈ ప్రాంతం స్వయం ప్రతిపత్తితో ఇస్లామిక్ రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న సిరియా అంతర్యుద్ధంలో పాల్గొంటున్నది. 2012 నుండి ప్రజా రక్షక విభాగాలు (వైపీజీ) ఇక్కడ ఏర్పడ్డాయి. టర్కీ నుండి వేలాది కుర్ధులు ఈ ప్రాంతానికి వలస వచ్చారు. 2014 లో ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ ) రొజావాలోని ‘కొబాని’ ప్రాంతాన్ని ఆక్రమించి ఆ పట్టణాన్ని నాశనం చేసింది. అయితే వైపీజీ దళాలు వెంటనే ఆ ప్రాంతాన్ని విముక్తం చేయగలిగాయి.

వైపీజీ దళాల్లో స్త్రీ పురుషులు సమానంగా ఉంటారు. పట్టణాలలోనూ, అన్ని చెక్ పాయింట్ల వద్ద బాహ్య శక్తుల నుండి రక్షణకు వీరు కాపల కాస్తుంటారు. వైపీజీలో (YPG) ఒక విభాగం వైపీజే (YPJ). స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులకు, గృహహింసకు వ్యతిరేకంగా ఈ విభాగం పని చేస్తుంది. ఈ వైపీజేలో పని చేస్తున్న గాలియా నామెట్ ఖాట్మండులో జరిగిన పునాది వర్గాల మహిళల రెండో మహాసభకు ప్రతినిధిగా హాజరు అయ్యారు. ఆమెతో పాటు కుర్ధిస్తాన్ నుండి వచ్చిన రోహష్ సెక్షో, సుసాన్ సఫక్, రుఫెండ్ జలాక్స్ లతో ‘మాతృక’ రెండు గంటల సేపు మాటా మంతి జరిపింది.

ప్రపంచంలో వివిధ ప్రాంతాల వారి భాష, వేషధారణ, సంస్కృతి, హావభావాల వ్యక్తీకరణ వేరుగా ఉన్నా పీడిత వర్గాలను కలిపే తాడు ఏదో ఉంటుంది. మహిళలుగా మేము వారితో ఏకత్వాన్ని అనుభవించాము. పోరాటం (ఆయుధ) జరుపుతున్న స్త్రీలగా వారిని అత్యంత గౌరవించాము. వీరితో జరిపిన సంభాషణలో మాకు బాష ఒక సమస్య అయ్యింది. వీరికి ఇంగ్లీష్ అంతంత మాత్రంగానే తెలుసు. సుసాన్ సఫక్ మాకు ఆంగ్ల అనువాదకురాలిగా గొప్ప సహాయం చేసింది. ముందుగా గాలియా భారతదేశ మహిళలతో మాట్లాడుతున్నందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. భారతదేశ సంస్కృతి వారికి ఎంతో దగ్గరగా ఉన్నట్లు చెప్పింది.

గాలియా: భారత స్త్రీలతో మాట్లాడటం మాకు గొప్ప అనుభూతి. ఎందుకంటే భారత సంస్కృతి కుర్డుల సంస్కృతికి దగ్గరగా ఉన్నట్లు మేము భావిస్తాము. ఈ ఇంటర్వ్యూ మాకు కూడా ముఖ్యమైనదే. మా సంగతులు భారత ప్రపంచానికి తెలియటం చాలా అవసరం (చిన్న నవ్వు)

మాతృక: మాకు కూడా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పోరాట ప్రాంతం నుండి వచ్చిన మిమ్మల్ని కలుసుకోవటం మాకు దొరికిన అరుదైన, అపురూపమైన అవకాశం. మీరు కుర్ధిస్తాన్ లో ఒకే ప్రాంతపు వారేనా?

గాలియా: కుర్ధిస్తాన్ లో వివిధ ప్రాంతాల నుండి మేము వచ్చాము. అయితే మహిళలలుగా మేము ఎదుర్కొనే సమస్యలు ఒకలాగే ఉంటాయి. ఉద్యమాల పట్ల మా దృక్పధం ప్రకారం చూస్తే మేము వేరు కాదు. రొజావా మహా కుర్ధిస్తాన్ లో ఒక భాగం మాత్రమే. మిగతా భాగాలు టర్కీ తూర్పు ఆగ్నేయా ప్రాంతాలు, ఇరాక్ ఉత్తర ప్రాతం, ఇరాన్ ఈశాన్య ప్రాంతం. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక సంస్థ ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలలోని కుర్ధులకు కలిసి ఒక గొడుగు సంస్థ ఉంటుంది. రొజావ, టర్కిష్ కుర్ధులకు కూడ అలాంటి సంస్థే ఉంది. దేశాల విభనజ రేఖలు మమ్మల్ని వేరు చేయలేక పోయాయి. ఈ విషయం కొబానిలో (కొబాని రొజావాలో ఒక ప్రాంతం. ఐసిస్ మూకలు దాని మీద దాడి చేశాయి) రుజువు అయ్యింది. కొబాని మీద దాడి జరిగినప్పుడు రొజావా సమాజంతో బాటు టర్కిష్, ఇరానీ సమాజాలు కూడా స్పందించాయి. రొజావా ఒక్కటే ఇప్పుడు స్వయం పాలిత ప్రాంతం. టర్కీలో ఉన్న కుర్ధిస్తాన్ భూభాగంలో జరుగుతున్న ఉద్యమంతో టర్కిష్ మహిళా ఉద్యమం కలిసి పయనిస్తున్నది. టర్కీలో ఇరవై కంటే ఎక్కువ కుర్ధిష్ మహిళా ‘మాయలు’ (కుర్ధిస్తాన్ దళాల్లో ‘మాయలు’ ‘ఉపమాయల’ పేరుతో ఉంటారు) జైళ్ళలో ఉన్నారు, లేక మాయమైపోయారు.

రొజావా మహిళలతో మాతృక బృందం

రొజావా మహిళలతో మాతృక బృందం

మాతృక: మొదట మీ పోరాటం ఎలా ప్రారంభం అయ్యింది? మహిళలు క్రియాశీలకంగా పోరాటాలలోకి రావటానికి భూమిక ఎలా ఏర్పడింది?

గాలియా: మా పోరాటం ముందు మా భాష కోసం ప్రారంభం అయ్యింది. కుర్ధిష్ భాషను మొత్తంగా తిరస్కరించారు. ఒక సమయంలో మా పండుగలు జరుపుకోవటం, మా దుస్తులు వేసుకోవటం కూడా నేరం అయ్యింది. అప్పుడు మహిళలు ఆర్గనైజ్ అయ్యారు. తర్వాత మహిళా గృహాలు ఏర్పడ్డాయి. అక్కడ విద్యా కార్యక్రమాలు జరిగేవి. మహిళలు ఇలా రావటం వారి భర్తలకు కోపం తెప్పించేది. గృహహింస కేసులు అక్కడికి నేరుగా రావటం మొదలయ్యింది. ఈ మహిళా గృహాలు తరువాత తరువాత మహిళల ఆర్ధిక విషయాలు కూడా పట్టించుకోవటం మొదలయ్యింది. జనాభా ప్రాతిపదికన ఈ గృహాలు ఏర్పడ్డాయి. మహిళా కమ్యూనిటీలు కూడా ఏర్పడ్డాయి. ఇవి సమాంతరంగా స్వయం ప్రతిపత్తితో పనిచేసే మహిళా సంస్థలు. అక్కడ మహిళలు తరచుగా కలిసే వాళ్ళు. బలవంతపు పెళ్ళిళ్ళు, పరువు హత్యలు, బహుభార్యత్వం, లైంగిక హింస, వివక్ష మొదలైన వాటికి వ్యతిరేకంగా ఈ కమ్యూనిటీలు పని చేస్తాయి.

రొజావా వ్యవస్థ లో ప్రెసిడెంట్, కో ప్రెసిడెంట్ పద్దతులు ఉంటాయి. పురుషులు ప్రెసిడెంట్లు అయితే స్త్రీలు కో ప్రెసిడెంట్లు అయ్యేవారు. స్త్రీలు ప్రెసిడెంట్లు అయితే పురుషులు కో ప్రెసిడెంట్లు అయ్యేవారు. రొజావాలోని అన్ని సంస్థల్లో 40 శాతం కోట స్త్రీలకూ, 40 శాతం పురుషులకూ, మిగతా ఇరవై శాతం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికి కేటాయించబడతాయి. చిన్న స్థానిక సంస్థల నుండి పై స్థాయి ప్రభుత్వం వరకు ఇవే రూల్స్ వర్తిస్తాయి. కొన్ని చోట్ల బాధ్యతల్లో 60 శాతం కూడా మహిళలు ఉన్నారు. జనరల్ కోటాలో కూడా సగానికి పైనే మహిళలు ఉన్నారు. జిల్లా ప్రజల కౌన్సిళ్లు పరిపాలన, ఆర్ధికంలాంటి విషయాలు చూస్తాయి. ఉదాహరణకు చెత్త నిర్వహణ, భూముల పంపకం మొదలైనవి. సామాజిక రంగంతో బాటు మహిళలు భద్రత దళాల్లో, మిలటరీ రంగంలో రిక్రూట్ అయ్యారు.

దాయెష్ మూకలు (ఐసిస్) ముందు మా ప్రాంతంలోని క్రిష్టియన్ మహిళలపై దాడి చేశాయి. మహిళలుగా స్వయంగా సమీకృతులవ్వాల్సిన అవసరాన్ని ఈ సంఘటన ముందుకు తెచ్చింది. తరువాత వాళ్ళు కొబాని మీద దాడి చేశారు. కొబానీని కూడా రక్షించుకొన్నాము.

మాతృక: రొజావా ప్రభుత్వం ఎలా పని చేస్తుంది?

గాలియా: ప్రజాస్వామ్యానికి మేము దారులు వేసుకొంటున్నాము. మా ఒక్క జాతి అస్తిత్వం కోసమే కాదు. బహుళ జాతులకు, వివిధ మతాలకు సమాన ప్రాతినిధ్యంతో ప్రజాస్వామ్యాన్ని మేము నిర్మించుకొంటున్నాము. ఇక్కడ కుర్ధులతో బాటు అరబ్బులు, క్రిష్టియన్లు, తురుష్కులు, యాజీదీలు, చచెన్లు, ఆర్మేనియన్స్, ఇంకా ఇతర మైనారిటీ జాతులు వారు ఎందరో జీవిస్తున్నారు. రొజావా మోడల్ లో మొదటి స్తంభంగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంటుంది. నైబర్ హుడ్, మునిపాలిటీల దగ్గరనుండి ప్రభుత్వంలో నిర్ణయాలు చేసి, స్వపరిపాలన చేసుకొనే వరకు పౌరులు అందరికీ సమాన పాత్ర ఉంటుంది. రెండవ స్తంభం కూడా విప్లవకరంగా ఉంటుంది. మేము రాజ్య నిర్మాణాన్ని తిరస్కరించాము. మైనారిటీ జాతులు అన్నింటికీ పరిపాలనా నిర్మాణంలో సమాన ప్రాతినిధ్యం ఇక్కడ ఉంటుంది. ఇలాంటి సమాజం స్త్రీలకు ఇవ్వాల్సిన స్థానం పట్ల కూడా జాగురుతతో ఉంటుంది. ఆ సమాజంలోనే స్త్రీలుకూడా బాధ్యతతో ఉంటారు. యవ్వనంలో ఉన్న మహిళలు కూడా ప్రజల కోసం ప్రాణాలు అర్పించటానికి యుద్ధంలో ముందు భాగంలో ఉన్నారు. మేమిక్కడ ఐసిస్ కు వ్యతిరేకంగా మాత్రమే కాదు, ఒక మెరుగైన సమాజం కోసం పోరాడుతున్నాము. ఒక విప్లవాత్మకమైన మార్పు కోసం పోరాడుతున్నాము. రొజావాలో నివసిస్తున్నవారందరికీ అణచివేత లేకుండా ఉండటానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. రొజావా ఇప్పుడు కుర్ధిస్తాన్ నినాదం నుండి ముందుకు పోయింది.

మాతృక: యుద్ధంలో మహిళల పాత్ర గురించి చెప్పండి.

వైపీజే దళాలు

వైపీజే దళాలు

గాలియా: ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నట్లు యుద్ధాల్లో మహిళలు కేవలం ఆఫీస్ పనికి పరిమితం అవటం, లేకపోతే గాయపడిన సైనికులకు సేవ చేయటం, లేక వంటలు చేయడం మాత్రమే కాకుండా ఇక్కడ మహిళలు యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. యుద్ధ క్షేత్రంలో మేము ముందుభాగాన ఉంటాము. జిహాదీలు మేమున్న ప్రాంతానికి ముప్ఫై కిలోమీటర్ల దగ్గరలోనే ఉంటారు. మేము నిత్యం అప్రమత్తతతోనే ఉంటాము. మహిళా రక్షక దళాలలో మహిళలు పని చేస్తారు. చెక్ పోస్ట్ లలో సెంట్రీలగా ఉంటారు. వాళ్ళు పగలు స్నిప్పర్లు వేస్తుంటారు. రాత్రిళ్ళు రాకెట్లు వేస్తారు. భారీ ఆయుధాల దళాల్లో కూడా స్త్రీలు ఉంటారు. మా యింకో జేబులో బుల్లెట్, సైనైడ్ రెడీగా ఉంటాయి. మేము ఐసిస్ కి బందీలుగా ఎప్పటికీ దొరకము. వారికి స్త్రీలు దొరికితే వారిపై లైంగిక దాడులు చేస్తారు. కొంతమందిని సెక్స్ మార్కెట్ కు బానిసలుగా అమ్మివేస్తారు. అంతకంటే మా ప్రజల కోసం, దేశం కోసం చనిపోవటానికి సిద్దంగా ఉంటాము. ఇప్పుడు ఐసిస్ వాళ్ళే మేమంటే భయపడుతున్నారు. ఎందుకంటే స్త్రీల చేతిలో చనిపోతే స్వర్గానికి వెళ్లలేమని వారికి ఒక నమ్మకం ఉంది.

మాతృక: పురుషాధిక్యత మీద మీ పోరాటం ఎలా ఉంటుంది?

గాలియా: మా యుద్ధం ద్విముఖంగా ఉంటుంది. ఒకటి జిహాదీలకు వ్యతిరేకంగా. రెండో యుద్ధం సమాన హక్కుల కోసం, సముచిత గౌరవం కోసం. సాంప్రదాయ కుర్ధిష్ సమాజంలో పూర్వాచార సాంప్రదాయం, స్త్రీల పట్ల వివక్ష ఉంటాయి. వాటికి వ్యతిరేకంగా కూడా మేము యుద్ధం చేయాల్సి ఉంటుంది. మధ్య ప్రాచ్యంలో చాలా మంది మహిళల కంటే మేము మెరుగ్గా జీవిస్తున్నాము. ఇరాక్ కుర్దూ సమాజంలో ఇంకా స్త్రీలను రాళ్ళతో కొట్టటం, స్త్రీల సెక్స్ అవయవాలమీద వాతలు పెట్టటం (ఎఫ్ జి ఎం), వైవాహిక లైంగిక దాడులు .. యివన్నీ ఇంకా ఉన్నాయి. అవిక్కడ లేనప్పటికీ ఇక్కడ ఇంకా స్త్రీలపై హింసా, లైంగిక వివక్షతా ఉన్నాయి. మేము యూరప్ స్త్రీల లాగా కొంత స్వతంత్రంగా కూడా లేము. మహిళల పట్ల ఇక్కడి దృక్పధం మారటానికి చాలా కాలం పడుతుంది. కానీ ఆ దారిలోనే ఉన్నామని భావిస్తున్నాము. చట్టాల్లో కూడా మార్పులు జరుగుతున్నాయి. పురుషల బహుభార్యత్వం నిషేధిస్తూ ఒక చట్టం వచ్చింది. ఇంతకు ముందు సిరియన్ చట్టంలో ఇస్లామిక్ ఆచారం ప్రకారం కోర్టులలో ఒక్క పురుషుడి సాక్ష్యం, ఇద్దరు స్త్రీల సాక్ష్యంతో సమానంగా ఉండేది. ఇప్పుడు రొజావా కోర్టు దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరూ చట్టపరంగా సమానులే. గృహహింస, బహు భార్యత్వం ఉన్న పురుషులను సంస్థల నాయకత్వం నుండి తొలగిస్తారు ఇక్కడ.

మాతృక: ఈ మొత్తం విషయంలో అమెరికా పాత్ర ఏమిటి? ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఉందా?

గాలియా: టర్కీ ఐసిస్ కి ఆయుధపరంగా, ఆర్ధిక పరంగా, వైద్యపరంగా పూర్తి మద్దతు ఇస్తుంది. టర్కీ అమెరికా చేతిలో కీలుబొమ్మ అని అందరికీ తెలుసు. టర్కీ సహాయం ఐసిస్ కు అందుతున్నప్పటికీ, మాకు సరైన ఆయుధాలు లేనప్పటికీ మేము కొబానీని కొన్ని నెలల యుద్ధం తరువాత విముక్తి చేయగలిగాము. సిరియాలో ఉన్న అస్సాదీ ప్రభుత్వం కూడా మాకు సహాయం చేయటం లేదు.

ఇరాక్ లో యాజీదీ అనే మైనారిటీ తెగ ఉంది. ఐసిస్ మొదట వారి పై దాడి చేసింది. ఇరాక్ సైన్యాలు వారిని రక్షించే ఆసక్తి చూపలేదు. వాళ్ళు ఉత్తరం వైపు ఉన్న షింగాల్ కొండల్లోకి పారిపోయారు. దాదాపు 50000 మంది యాజీదీలు ఆకలితో అలమటించారు. అప్పుడు అమెరికా ప్రవేశం నాటకీయంగా జరిగింది. ఐసిస్ మీద బాబులు వేసినట్లు నటించి కొంత ఆహారాన్ని విమానాల ద్వారా యాజీదీలు ఉన్న కొండ ప్రాతాలకు సరఫరా చేసింది. అంతర్జాతీయంగా ఈ విషయం మీదా చాలా చర్చ జరిగినప్పటికీ యాజీదీలకు అందాల్సిన సహాయం అందలేదు. అప్పుడు మా (వైపీజీ) దళాలు సిరియా సరిహద్దులు దాటి ఇరాక్ కొండల్లోకి వెళ్ళి వారిని అక్కడ నుండి రక్షించారు. అప్పుడు మాత్రమే పాశ్చాత్య మీడియా మమ్మల్ని గుర్తించింది. అయితే యూనిఫార్మ్ లో ఉన్న మా యువతుల ఫోటోలు ప్రచురించటంలో చూపించిన ఆసక్తి మా రాజకీయాలు, వాటి వెనుక ఉన్న పికేకె (పీపుల్స్ వర్కింగ్ పార్టీ) రాజకీయాలు ప్రపంచానికి చెప్పటంలో చూపించలేదు.

మాతృక: మీ వెనుక ఉన్న గురించి రాజకీయాలు చెప్పండి.

గాలియా: మా రాజకీయాలు వెనుక పీపుల్స్ వర్కింగ్ పార్టీ ఉంది. పికేకె (పీపుల్స్ వర్కింగ్ పార్టీ) మొదట టర్కిష్ వామపక్ష విద్యార్ధి ఉద్యమం నుండి పుట్టింది. చైనా, వియత్నాం ఉద్యమాలతో స్పూర్తి పొందింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు అబ్ధుల్లా అక్లాన్ గొప్ప స్త్రీ వాది. మహిళా విముక్తిని ప్రచారం చేశాడు. గతంలో జరిగిన దేశ విముక్తి పోరాటాల్లో స్త్రీలు పాల్గొని సైనికులుగా పని చేసినప్పటికీ ఆయా దేశాలు విముక్తి అయ్యాక మహిళలు మళ్ళీ పితృస్వామిక చట్రాల్లో బింగించబడ్డారు. ఒక్లాన్ స్త్రీల గురించి మాట్లాడుతూ ‘విప్లవంలో కార్మికవర్గ పాత్రను ఇప్పుడు స్త్రీలు సమానంగా తీసుకోవాలి’ అన్నాడు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించింది అతడే.

మాతృక: సిరియా మహిళా శరణార్ధుల విషయం ఏమిటి? వారు ఇతర యూరోపియన్ దేశాలకు పారిపోకుండా మీలాగా ఎందుకు నిలబడి పోరాటం చేయటం లేదు?

గాలియా: సిరియాలో ఇతర ప్రాంతాల్లో ఉన్న మహిళలు (రొజావా కాకుండా) ఆర్గనైజ్ అవలేదు. సిరియా మారణకాండ తరువాత అక్కడ జీవించడం కష్టం అవుతుంది. కానీ సిరియా మహిళా ఉద్యమానికి కూడా ఒక చరిత్ర ఉంది. 1925లో సిరియా ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం పొందాకా జెనెరా అనే మహిళ ఒక మహిళా సంఘాన్ని ప్రారంబించింది. సిరియాలో ఒక పత్రిక కూడా నడిపింది. అయితే అది కూడా పురుష ఆధిపత్యంలోనే ఉండేది. కుర్దూ మహిళల స్థైర్యం సిరియా మహిళలకు లేదు. వారు భయపడతారు. వాళ్ళ కుటుంబం గురించి, పిల్లల గురించి ఎక్కువ ఆందోళన పడతారు. రొజావాలో మూడు మిలియన్ల కుర్దులు నివసిస్తున్నప్పటికీ ఇప్పుడు మా ఉద్యమం సరిహద్దులు గీసుకోలేదు. సిరియా, అరబ్, యాజిదీ, ఇంకా అనేక జాతుల మహిళల గురించి కూడా పనిచేస్తున్నాము. అయితే ఇప్పుడు సిరియాలో కూడా వైపీజే లాంటి మిలటరీ సంస్థ ఏర్పడుతున్నది. అలాగే అరబ్ మహిళలలో కూడా అలాంటి సంస్థ ప్రారంభం కాబోతుంది. మేము వారికి సహాయం చేస్తున్నాము. రొజావా విద్యా సంస్థల్లో కుర్దూ బాషతో బాటు, అరబిక్, సిరియన్, ఇంగ్లీష్ బాషల్లో కూడా విద్యాబోధన జరుగుతుంది.

మాతృక: అంతర్జాతీయ ప్రపంచం నుండి మీకు మద్దతు ఎలా ఉంది?

గాలియా: పికేకె (పీపుల్స్ వర్కింగ్ పార్టీ)కి టెర్రరిష్టు పార్టీగా ముద్ర వేశారు. ఆ ముద్ర అంతర్జాతీయ సహాయం అందకుండా అడ్డం పడుతుంది. కొబాని మీద దాడి జరిగాక అక్కడ ఆర్ధిక పరిస్థితి చాలా దిగజారిపోయింది. మాకు ముందు అంతర్జాతీయ మద్దతు ప్రచారం కావాలి. మా పార్టీ రాజకీయాలు, ఆ పార్టీ నొక్కి చెబుతున్న ప్రజాస్వామ్య పరిపాలన, లౌకికవాదం, పర్యావరణం, మహిళా విముక్తి గురించి ప్రచారం జరగాలి. టర్కీ మీదా, ఇరాకీ కుర్దుల మీద వత్తిడి తెచ్చి మాకు వస్తున్న ఆహార సరఫరాలు ఆపకుండా మాకు అందేలా చూడాలి. రొజావా టెర్రరిష్టు పట్టికలో లేనప్పటికీ పికేకెకీ మాకు ఉన్న సంబంధం వలన మమ్మల్ని కూడా ఎక్కడకీ రానివ్వటం లేదు. మా మీద ఉన్న టెర్రరిష్టు ముద్ర తొలిగిస్తే మేము యితర ప్రాంతాలకు వెళ్ళి ఆ భావాలు ప్రచారం చేసుకోని మద్దతు కూడగట్టుకోగలుగుతాము.

మాతృక: చివరిగా మీ ఉద్యమం ఆశయం ఏమిటి? రొజావా ప్రపంచానికి ఏమి చెప్పబోతుంది?

గాలియా: రొజావాలో ప్రజాస్వామ్య నిర్మాణం వాస్తవరూపం దాల్చిందని మేము నమ్ముతున్నాము. ఈ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. ఇక్కడ స్త్రీలు పురుషులతో సమానంగా అడుగులు వేస్తున్నారు. రొజావా సిరియాకు.. ఇంకా చెప్పాలంటే మధ్య ప్రాచ్యానికి ఒక ప్రత్యామ్నాయ భవిషత్తు కాబోతుంది. ఆ భవిష్యత్తు ఎలాంటిదంటే అందులో వివిధ జాతులు, మతాల వాళ్ళు కలిసి జీవిస్తారు. స్త్రీలకు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం లభిస్తుంది. రొజావా సుస్థిరత సాధిస్తే టర్కీ, ఇరాక్, ఇరాన్, సిరియాలో ఉన్న మహిళలకు ఒక కొత్త లోకం లభిస్తుంది. బాల్య వివాహాల నుండి తప్పించుకోవటానికి, లౌకిక విద్యా విధానం సంభవించటానికి రొజావా వారికి ఒక మోడల్ గా ఉంటుంది. ప్రపంచాన్ని మార్చటానికి ఒక కొత్త రాజకీయ సంస్కృతి కావాలి. ఆ సంస్కృతిలో స్త్రీ పురుషులు విడిపోయి ఉండకూడదు.

(ఈ ఇంటర్వ్యూ మే, 2016 మాతృక సంచికలో ప్రచురితం అయ్యింది)