ట్యాగులు

, , , , , , ,

 

dc-Cover-eat1nl09s1tu0h62ash0ht51o5-20160504013009.Medi

ప్రియమైన జిషా,

నువ్వు ఎవరో నాకు తెలియదు. బహుశా నేను ఎవరో కూడా నీకు తెలియక పోవచ్చు.

నువ్వు ఒక మామూలు విద్యార్ధినివి అయి ఉంటావు. నీ ఉజ్వల భవిష్యత్తు గురించి, యింకా నీ దేశం గురించి కలలు కనే ఉంటావు. నువ్వు నక్షత్రాల గురించీ, ఆకాశం గురించీ కలలు కన్న ‘రోహిత్ వేముల’ లాగా కూడా ఉండి ఉంటావు. నువ్వు ఒక న్యాయశాస్త్ర విద్యార్ధినివి అని విన్నాను. కానీ ఈ దేశంలో న్యాయం మన విషయంలో ఘోర పరాజయం పొందిందని చెప్పటానికి నేను చింతిస్తున్నాను.

భన్వర్ దేవికి న్యాయం జరగలేదు కాబట్టి, భాగనా విషయం జరిగింది. భాగనా విషయంలో ఎవరికీ న్యాయం జరగలేదు కాబట్టి డెల్టా మేఘావల్ విషయం జరిగింది. డెల్టా మేఘావల్ కు న్యాయం జరగలేదు కాబట్టి జిషా విషయం జరిగింది. చాలా బాధతో ఊహిస్తున్నాను. నీకు కూడా న్యాయం జరగదు.

నువ్వు చదివిన న్యాయ శాస్త్రం ఈ దేశాన్ని నడపటం లేదు. ఈ దేశం మనుస్మృతి అని చెప్పబడే ఒక సమాంతర చట్టంతో నడపబడుతున్నది. ఆ మనుస్మృతిని జడ్జీలు యాంత్రికంగా రోజు ప్రవచిస్తారు ఇక్కడ. బహుశా నువ్వూ ఆ న్యాయశాస్త్ర బడిలోనే చదివి ఉండవు. ఈ మనుస్మృతి న్యాయశాస్త్రం స్త్రీల హద్దులను, దళితుల హద్దులను వర్ణిస్తుంది.

అది మహిళలు ఏఏ వేళల్లో బయటికి పోకూడదో చెబుతుంది. మహిళలు చదువుకొని స్వతంత్రంగా ఉండకూడదనీ చెబుతుంది. దళితులు చదువుకొని ప్రావీణ్యం పొందకూడదని చెబుతుంది. ఈ సూత్రాలు అన్నీ దేశాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్నాయి.

96958286_Kerala-large_trans++eo_i_u9APj8RuoebjoAHt0k9u7HhRJvuo-ZLenGRumA

నువ్వు ఈ దేశాన్ని ప్రేమించే ఉంటావు. కానీ ఈ దేశం మహిళల కొరకు లేదని చెప్పటానికి నేను చింతిస్తున్నాను. అంతే కాకుండా నువ్వు ఎప్పుడైనా పితృస్వామ్యం, కులం, వర్గం గురించి మాట్లాడితే వాళ్ళు నీ గొంతు మీద కత్తి పెట్టి ‘భారత్ మాతకూ జై అనూ’ ‘వందేమాతరం అనూ’ అంటారు. ఎవరైనా న్యాయం గురించి అడిగితే ఈ రెండు నినాదాలు మన ప్రభుత్వానికి యిష్టమైన ప్రతిస్పందనలు.

నేను నువ్వు ఒక దేశభక్తురాలివనీ, నీ దేశాన్ని ప్రేమించావనీ అనుకొంటున్నాను. కానీ నువ్వు లైంగిక దాడికీ, హత్యకూ గురి అవుతున్నప్పుడు ‘భారత్ మాతకూ జై’ నీ సహాయానికి వచ్చి ఉండదు. నీ పైన జరిగిన అత్యాచారపు వివరాలు గురించి ఆలోచించాలంటే నాకు వణుకు వస్తుంది. ఆడపిల్లలను పురిట్లోనే చంపేసే తల్లిదండ్రులు మంచి పని చేశారని అనిపిస్తుంది. ఎంతో స్థైర్యంతో, సహనంతో ఉండాల్సిన నాబోటి వారికి ఇలాంటి నిస్పృహ ఆలోచనలు వస్తున్నాయి. నాకు కాకపోయినా ఎవరికైనా ఈ ఆలోచనలు వస్తాయి. నాకు నువ్వు తెలియదు, కానీ ఆ లైంగిక దాడి సమయంలో నీ భయం నాకు అనుభవం అవుతోంది.

నీకు జరిగిందే నాకు బెదిరింపుల రూపంలో బీజేపీ కార్యకర్తలు ట్విట్టర్ లో చెప్పారు. ఈ ఆలోచనలు ఎక్కడ నుండి వస్తున్నాయి? నీపై లైంగిక దాడి చేసిన వ్యక్తుల ఆచరణ, సంఘీ పరివార్ వ్యక్తుల పదజాలం ఒకేలా ఎలా ఉన్నాయి? ఈ భావజాలం మనువుది. అది ద్వేషం, కుల పితృస్వామ్యంతో నిండి ఇద్దరు నేరస్తులను ఒకేలా పని చేయిస్తుంది.

నీకు న్యాయం జరగదు. ఎందుకంటే మేము అత్యాచారాన్ని నిందిస్తాము, దాని కారణం గురించి పట్టించుకోము. మేము అత్యాచారానికి కారణాలుగా మహిళల వస్త్రధారణనూ, మహిళల ఛాయిస్ లనూ, వారి పేదరికాన్నీ, మద్యపానాన్నీ, వాళ్ళు తినే నూడీల్స్ నూ , వాళ్ళు వాడే మొబైల్ ఫోన్స్ లాంటి చిన్న చిన్న విషయాలను నిందిస్తాము. కానీ మన సమాజంలో ఉన్న పితృస్వామ్యం, ఫ్యూడలిజం, పెట్టుబడీదారీ విధానం మహిళలను మార్కెట్ సరుకుగా చూడటం, కులం… ఇలాంటి విషయాల జోలికి వెళ్లము.

మేము నీలాంటి మహిళలకు న్యాయం జరగాలని అడిగినప్పుడూ… భాగనా సామూహిక లైంగిక దాడిలో బతికి బట్టకట్టిన వారికి న్యాయం జరగాలని అడిగినప్పుడూ … కాశ్మీర్లో ఈశాన్య రాష్ట్రాలలో మహిళలకు తుపాకి గురిపెట్టి చేస్తున్న అత్యాచారాల గురించి అడిగినపుడూ … కార్పొరేట్ కంపెనీలు ఆదివాసుల మీద చేస్తున్న దురాక్రమణను ప్రశ్నించిన సోనీ సోరీని మావోయిస్టుగా ముద్ర వేసి ఆమె రేపిస్టులకు పరాక్రమ చక్రాలు యిస్తే ప్రశ్నించినపుడూ … మేము రాజకీయాలు చేయకూడదని వాళ్ళు చెబుతారు.

నువ్వు ఎన్నో లక్షల మంది విద్యార్ధులలాగానే రాజకీయాల జోలికి వెళ్ళకుండా చదువుకునే విద్యార్ధివే అయి ఉంటావు. అయినా ఈ సమాజ క్రూరత్వం నిన్ను కూడా వదిలి పెట్టలేదు. నీ పై జరిగిన క్రూరత్వం నీమీద వ్యక్తిగత కక్ష ఫలితంగా జరిగిందని నేను నమ్మటం లేదు. అది వేళ్ళూనికొని ఉన్న వివక్ష, స్త్రీ ద్వేషం, మహిళలను సరుకులుగా భావించటం, వాడి వదిలేసే వస్తువులుగా వారిని చూడటం .. అనే విషయాల ఫలితంగా వచ్చిందని నేను అనుకొంటాను.

నువ్వు అనుభవించిన హింస సమస్త స్త్రీల మీద రుద్దబడుతున్న ద్వేషం మాత్రమే. నా మీదా.. నా స్నేహితురాళ్ళ మీద … ఆలోచిస్తున్న, మాట్లాడుతున్న, పని చేస్తున్న, ప్రశ్నిస్తున్న, రాజకీయ కార్యాచరణలో ఉన్న అందరు మహిళల మీదా ఉన్నదే. ఎందుకంటే మేము సాంప్రదాయకమైన వారిమి కాదు కాబట్టి. మా జెండర్ నూ, రెండవ తరగతి పౌరుల స్థితినీ, తక్కువ కులాల స్థితినీ ఉల్లంఘించటానికి మాకెంత ధైర్యం అని వాళ్ళు అంటారు.

మేము కులాల గురించీ, వర్గాల గురించీ, జండర్ గురించీ, జాతుల గురించీ, అంగవైకల్యుల గురించీ మాట్లాడినపుడు ప్రజలను విడదీయవద్దని అంటారు. అప్పుడు రాజ్యాంగంలో సమానత్వం గురించి చెబుతారు.

కానీ త్వరలో కులానికి సంబంధించిన అందవిహీనమైన వాస్తవం మా మీదా త్వరలోనే పడబోతోంది. మేము నీకోసం న్యాయం అడిగినపుడు.. నీ కేసు నిర్భయ కేసులాగానే క్రూరత్వంతో నిండి ఉన్నా దేశాన్ని ఎందుకు కదిలించలేదని అడిగినపుడూ, నీ కేసులో ఎవరూ శిక్షింపబడలేదని అడిగినపుడూ ఈ వాస్తవం మాకు ఇంకో సారి విదితం అవుతుంది.

నీ ఆత్మ శాంతించాలని తోటి మహిళగా అనాలని నేనెంతో కోరుకొంటున్నాను అక్కా. కానీ మేము బతికి ఉన్న కాలాలు మమ్మల్ని అలా అననీయటం లేదు.

‘జిషా! నీ ఆత్మ శాంతించకూడదు’ అనాల్సి వస్తుంది. అంతే కాదు ఈ దేశంలో ఎవరూ ప్రశాంతంగా ఉండకూడదని చెప్పాల్సి వస్తుంది.

ఈ దేశాన్నీ, ఈ ప్రపంచాన్ని ఉద్రేకపరుచు. వారి ఉల్లాసాల నుండి వారిని నిద్ర లేపు.

ఇట్లు

 శెహ్ల

[సెహ్ల రషీద్ జెఎన్యూలో ‘సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ లా అండ్ గవర్నెస్’ విభాగంలో విద్యార్ధిని. ఆమె ఆల్ ఇండియా స్టూడెంట్స్ అస్సోసియేషన్ (AISA) యాక్టివిష్టు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్.ఈ వ్యాసం కెఫీలా అనే వెబ్ సైట్ లో ఉన్నది.]