ట్యాగులు

,

 

నేపాల్ లోని ఖాట్మండులో మార్చ్ 2016 లో జరిగిన ‘పునాది వర్గాల మహిళ రెండవ అంతర్జాతీయ మహాసభ’ లో మల్లకా అగస్టిన్ యిచ్చిన యూరప్ ఖండ నివేదిక

Mallaka Agustin

భూమ్మీద ఉన్న ఖండాలలో రెండో చిన్న ఖండం యూరప్. దీనిలో 50 రాజ్యాలున్నాయి. 742 మిలియన్ల జనాభా ఉంది. యూరప్ లోని రాజ్యాలను కలిపివుంచే ముఖ్యమైన సంస్థ యూరోపియన్ యూనియన్. దీనిలో 28 సభ్య రాజ్యాలున్నాయి. 505 మిలియన్ల జనాభా ఉంది. 19 రాజ్యాల్లో ఒకే మారక ద్రవ్యం. అది యూరో. యూరోపియన్ యూనియన్ లోని 22 దేశాలకు ‘నాటో’ లో సభ్యత్వం ఉంది. ప్రపంచ జనాభాలో ఏడు శాతం మాత్రమే యూరోపియన్ యూనియన్ లో నివసిస్తున్నా, ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 25 శాతం ఇక్కడి నుంచే పుడుతోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద దేశీయ విపణి ఉన్న దేశాల కూటమి. అమెరికా, చైనా, రష్యాలతో ఇది బలమైన సామ్రాజ్య శక్తిగా పోటీకి నిలబడుతోంది. యూరోపియన్ యూనియన్ లోని ఒకటి రెండు మూడు స్థానాల్లో వరుసగా ఉన్న ఆర్ధిక రాజకీయ సామ్రాజ్యవాద శక్తులు జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ లు. మరోవైపు స్త్రీ పురుష కార్మిక సమూహాలు కూడా బలమైన శక్తిగా ఉన్నాయక్కడ. ఇక్కడున్న 218 మిలియన్ల ఉద్యోగుల్లో పావువంతుమంది పారిశ్రామిక రంగ శ్రామికులే. గడిచిన 130 ఏళ్ళలో యూరోప్ లో బలమైనవని చెప్పుకోదగ్గ స్త్రీ, యువక, పర్యావరణ, సామాజిక ఉద్యమాలూ సంస్థలూ ఎన్నో పుట్టాయి. గట్టి ఉద్యమాల వల్ల గొప్ప సామాజిక విజయాలు, విద్యావకాశాలు, రాజ్యాంగాలలో చట్టాలలో స్త్రీలకు హక్కులూ సాధించుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టారు.

పెట్టుబడిదారీ సమాజం లాభంకోసం పాకులాడుతుంది. మనిషినీ ప్రకృతినీ దోపిడీ చేస్తుంది. నయా వలసవాద దోపిడీని సాగిస్తూ అప్పనంగా అన్నిటినీ మింగుతుంది. సామాజిక వాస్తవికతను అణచివేస్తుంది. చట్టాల ద్వారా సమాన హక్కులు లభించి స్త్రీల జీవితాలు మెరుగు పడ్డాయి. అయినా పెట్టుబడిదారీ విధానంలో సామాన్య ప్రజానీకంలో భాగంగా ఎదుర్కొనే అణచివేతతో పాటు స్త్రీజన్మ ఎత్తిన పాపానికే స్త్రీలు అదనంగా అణచివేతను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల వివక్షకు వ్యతిరేకంగా ఎన్నోరకాల గట్టి చర్యలు తీసుకున్నా, ప్రపంచంలో స్త్రీలందరి సమస్యలూ ప్రాథమికంగా ఒకేలా ఉంటాయి. స్త్రీలంతా ఒకే లక్ష్య సాధనకోసం శ్రమించాలి. అధినేతలూ మంత్రులూ అయిన స్త్రీలు కూడా దీనికి మినహాయింపు కాదు.

europe-map-political

యూరోపియన్ యూనియన్ లో నిరుద్యోగుల సంఖ్య అధికారికంగా 10 శాతం. గ్రీస్, స్పెయిన్ లాంటి దేశాల్లో ఇది 25 శాతం వరకూ ఉంది. అక్కడ సగంమంది యువతకు ఉద్యోగాలు లేవు. చాలామంది వలసలు కూడా వెళ్తున్నారు.

యూరోపియన్ యూనియన్ నిర్ణయించే ఆర్ధిక, న్యాయ చట్రాలలో సభ్య రాజ్యాలు ఒదిగి ఉండాలి. 2008 నుండి 2014 దాకా ఏర్పడిన ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ముందూ తరువాతా కూడా గ్రీస్ దేశం ఈ చట్రాల్లో ఎలా పతనమైందో మనం చూశాం. ఈ సంక్షోభం బరువునంతా నిర్దాక్షిణ్యంగా ప్రజలమీద మోపారు. జనం ఆశలు పెట్టుకున్న వామపక్ష ప్రభుత్వాలు కూడా అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, యూరోపియన్ కమిషన్ ల ఆదేశాలకు లొంగాల్సి వచ్చింది. వేతనాలను దారుణంగా తగ్గించారు. అతి తక్కువ వేతనాల్లో కూడా 25 శాతం తగ్గించారు. పెన్షన్లు 5 నుంచి 15 శాతం వరకూ తగ్గాయి. సామాజిక, ఆరోగ్య సేవా రంగాల్లో కోతల వల్ల మిలియన్ల మందిని పేదరికం, ఆకలి, గూడు లేకపోవటం అనే సమస్యలు చుట్టుముట్టాయి. యూరోపియన్ యూనియన్ గ్రీస్ కి ఉదారంగా ఇచ్చిన అప్పులు సామ్రాజ్యవాద దేశాలకు చెందిన పెద్ద అంతర్జాతీయ బ్యాంకుల అప్పుల ఖాతాలోకి వెళ్ళిపోయాయి. గ్రీక్ స్త్రీలు ఇలా అంటున్నారు: “గడిచిన నాలుగేళ్ల నుండీ ప్రతీదీ మరింతగా దిగజారిపోతోంది. దేశం అప్పుల్లో ఉందనీ, పెట్టుబడిదారీ సంక్షోభమనీ, సంపద పెరుగుతుందనీ చెప్తూ మేము ఉద్యమాల ద్వారా సాధించుకున్న హక్కులన్నిటినీ ఒకటొకటిగా లాక్కుంటున్నారు”. చివరికి యూరోప్ లో ఎక్కడా కూడా సంక్షోభానికి ఎవరైతే కారకులో వాళ్ళు ఎటువంటి మూల్యం చెల్లించలేదు. భారం అంతా జనం మీద పడింది. ప్రభుత్వం మీద ఉన్న భ్రమలన్నీ ఎగిరిపోగా నిశ్చేష్టులైన జనం, ముఖ్యంగా మహిళలూ కార్మికులు సాధారణ సమ్మెలు చేపట్టి మళ్ళీ ఉద్యమించారు.

erup

ఆర్ధిక సంక్షోభపు భారాన్ని జనం మీద వెయ్యరాదంటూ చేసిన పోరాటానికి వెన్నెముకగా నిల్చినది పారిశ్రామిక కార్మికులు. నవంబర్ 14, 2012 న 14 యూరప్ దేశాలన్నిటిలోనూ ఒకేసారిగా సమ్మె మొదలయింది. దీన్ని ఆయాదేశాల యూనియన్లు అన్నీ సమిష్టిగా నిర్వహించాయి. గ్రీస్ లో ఉక్కు పరిశ్రమ కార్మికులు 9 నెలలపాటు సమ్మె చేశారు. జర్మనీ లో ‘ఓపెల్’ శ్రామికులు సమ్మెలూ ఉద్యమాలూ చేస్తూ తమ పరిశ్రమను మూయనివ్వకుండా పదేళ్ళపాటు పోరాడారు. కానీ చివరకు ఓడిపోయారు. అయినా వేలకొద్దీ అటోమొబైల్ రంగ శ్రామికులూ గని కార్మికులూ ఈ సాహసోపేతమైన పోరాటాన్ని అందిపుచ్చుకుని కొనసాగించారు. స్పెయిన్, బల్గేరియా, జర్మనీ, యుక్రెయిన్ లోని గని కార్మికులు గనుల మూసివేతకు వ్యతిరేకంగా పోరాడారు. పర్యావరణానికి చాలా హాని చేసే ఫ్రాకింగ్ (భూమిలోకి రంధ్రాలు తవ్వి, రసాయనాలూ, ఇసుక మొదలైనవి పంపి సహజ వాయువునూ చమురునూ బైటకు తీయటం) పద్ధతిలో గనుల తవ్వకాన్ని వ్యతిరేకించారు. ఈ పోరాటాలన్నిటిలోనూ స్త్రీలు తమదైన ప్రధాన పాత్రను నిర్వర్తించారు.

యూరప్ లో చాలామంది ప్రజలు బూర్జువా రాజకీయ నాయకులను నమ్మటం మానేశారు. 2014 లో జరిగిన యూరప్ ఎన్నికలలో 42 శాతంమంది మాత్రమే ఓట్లు వేశారు. ప్రజల భావాలు రెండు వ్యతిరేక దిశల్లో విడిపోతున్నాయి. గ్రీస్ లో స్పెయిన్ లో వామపక్ష పార్టీలు గెలుపొందాయి. మరోపక్క పోలండ్ లో, ఫ్రాన్స్ లో ప్రమాదకరమైన జాతీయవాద, ప్రజావ్యతిరేక, ఫాసిస్ట్ రైట్ వింగ్ పార్టీలు ముందుకొస్తున్నాయి. హంగరీ, పోలండ్ లలో ఇవి అధికారంలోకి కూడా వచ్చాయి. నవంబర్ 2015 లో పారిస్ లో జరిగిన దాడుల తరువాత ఎమర్జెన్సీ విధించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేసిన పెద్ద ప్రజా ఉద్యమాలవంటి ఉద్యమాలు తరచూ జరుగుతున్నాయి.

EqualPay1untitled

ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ శరణార్ధుల విషయంలో బాహాటమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం యూనియన్ విడిపోవటానికి కారణమయేంతగా పెరిగిపోవచ్చు. ముఖ్యంగా స్త్రీలూ, యువకులూ చేస్తున్న నిజమైన అంతర్జాతీయ ప్రజా ఉద్యమం, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ లనుంచి వెల్లువెత్తుతున్న శరణార్థులకు సహాయాన్నందిస్తూ ఆదుకుంటోంది. జర్మనీ లాంటి ప్రభుత్వాలు వీరిని ఆహ్వానిస్తున్నట్టుగా కొంతవరకైనా నటిస్తున్నాయి. కానీ నిజానికవి తిరోగమన చర్యలలో ఒకదాన్నొకటి మించిపోతున్నాయి. వేల సంఖ్యలలో శరణార్థులు మధ్యధరా సముద్రంలో మునిగి చనిపోతున్నారు. సరిహద్దులు మూసేసి శరణార్థి రక్షణ చట్టాలను గట్టిగా బిగిస్తున్నారు. జర్మనీ ప్రభుత్వమూ పరిశ్రమల యజమానుల సంఘాలూ కలిసి యూరోపియన్ యూనియన్ బయటున్న సరిహద్దులను శరణార్థులు చొరనివ్వకుండా మూసేసే వ్యూహంలో ఉన్నాయి. దీనికి టర్కీ లోని ఫాసిస్ట్ ప్రభుత్వం అండ ఉంది. రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాల కోసం దేశాల మధ్య ఉండే స్వేచ్ఛా ప్రాంతాన్ని మాత్రం మూసివేయలేరు. అక్కడి ప్రజలు ప్రజాస్వామికవాదులు. ప్రశ్నించే ప్రజలమీదా, కుర్దుల స్వాతంత్ర్య పోరాటం మీదా టర్కీ అకృత్యాలు చేస్తోంది. రోజావాలో స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు, స్త్రీల హక్కులూ సమానత్వం కోసం అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటాన్ని ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది.

ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ జర్మనీలలో స్త్రీల ఉద్యమాలు, వలసవచ్చినవారితోనూ సాన్స్ సేపెయర్లతోనూ కలిసి తమ రాజకీయ సామాజిక హక్కులకోసం పోరాటం చేస్తున్నాయి. అలాగే పారిపోయి వచ్చిన స్త్రీల రక్షణా ఆత్మస్థైర్యాల కోసం కూడా. సామ్రాజ్యవాదం ప్రతిరోజూ మనుషులు తామున్నచోటును వదిలి పారిపోవటానికి కొత్త కొత్త కారణాలు సృష్టిస్తోంది. ఆయా దేశాల ప్రజానీకం, ముఖ్యంగా స్త్రీలు దీనికి బలౌతున్నారు. జర్మనీలో శరణార్థులు కుటుంబాలు కలుసుకోవటం మీద ఆంక్షలున్నాయి. అంటే పనిచేసే మగవాళ్ళను మాత్రమే దేశంలోకి రానిస్తారు. వారి స్త్రీలూ పిల్లలూ యుద్ధ ప్రాంతంలో మగ్గిపోవలసిందే.

యూరప్ లో చాలామంది స్త్రీలు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. కానీ పార్ట్ టైం ఉద్యోగాలూ మరీ చిన్న ఉద్యోగాలూ అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న స్త్రీల శాతం మరీ ఎక్కువగా ఉంటోంది. స్విట్జర్లాండ్ స్త్రీలు ఇలా అంటున్నారు. “పార్ట్ టైం ఉద్యోగాల్లో మేం బలవంతంగా వేతన త్యాగాలు చేస్తున్నాం. అందువల్ల స్విస్ ట్రేడ్ యూనియన్ల సమాఖ్య తాలూకు మహిళా కాంగ్రెస్ స్త్రీలకు వారానికి 30 గంటల పనిని పూర్తి వేతన పరిహారంతోపాటు ఇవ్వాలని కోరింది”. మొత్తం యూరోపియన్ యూనియన్ లో 77 శాతం స్త్రీలు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వీరిలో 68 శాతం మంది తల్లులు. ఒంటరి తల్లులూ, వాళ్ళ పిల్లలూ, పెన్షనర్లూ ఎక్కువగా బీదరికం బారిన పడుతుంటారు. ఒకే రకమైన పనికి స్త్రీ పురుషుల మధ్య వేతనాల్లో తేడా 20 నుండి 33 శాతం వరకూ ఉంటోంది యూరప్ దేశాల్లో. రష్యా స్త్రీలు ఇలా అంటున్నారు “రష్యాలో 71 శాతం స్త్రీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. కానీ ఉన్నత పదవుల్లో ఉన్న స్త్రీలు 12 శాతం మందే”.

చాలా యూరప్ దేశాల్లో పిల్లల సంఖ్య తక్కువ. సగటున ఒక స్త్రీకి పుట్టే పిల్లల సంఖ్య 1.6 మాత్రమే. ఒక్కొక్కరే ఉండే ఇళ్ళూ, ఒంటరి తల్లులూ తండ్రులూ పెరిగిపోతున్నారు. తక్కువమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. బూర్జువా వివాహ వ్యవస్థ పెద్ద సంక్షోభంలో పడింది. పెట్టుబడి శక్తుల నియంత్రణ కేంద్రాల్లోని కార్యాచరణ బోర్డుల్లో స్త్రీల సంఖ్య నాలుగు శాతమే. బైట ఉద్యోగాలు చేస్తున్నా పిల్లల బాధ్యతా ఇంటి బాధ్యతా పెద్దవారిని చూసుకోవటం వంటి పనుల బరువు స్త్రీలకే ఎక్కువ. సమాజంలోని దైనందిన జీవితాన్ని సాఫీగా నడిపే బాధ్యత స్త్రీల భుజాలమీదే ఉంది. ఉద్యోగానికీ కుటుంబానికీ మధ్య స్త్రీలు నలిగిపోతున్నారు. సామాజిక సంక్షేమం మీద ప్రభుత్వ దృష్టి తగ్గిపోతున్నకొద్దీ స్త్రీలమీద ఈ బాధ్యత ఇంకా పెరిగిపోతోంది. గ్రీస్ మహిళలు ఇలా అంటున్నారు: “స్త్రీలకు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు పిల్లలను కనబోమని బలవంతంగా సంతకం చేయించుకుని మరీ ఇస్తున్నారు. పెద్ద వయసు స్త్రీలను తీసివేసి ఆ స్థానంలో కుటుంబ బాదరబందీ లేని యువతులను ఉద్యోగాల్లో నియమిస్తున్నారు”.

హింస వల్ల స్త్రీలకు ఎక్కువగా ఆరోగ్య హాని జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఎంతో అభ్యుదయవాదులమని నటించే యూరప్ దేశాల్లో కూడా ఇది విషాదకరమైన అతిపెద్ద నిజం. హింసకెన్నో రూపాలున్నాయి. కుటుంబ వాతావరణంలోనే ఎంతో మంది స్త్రీలు హింసకు గురౌతున్నారు. తమ హక్కులకోసం తీవ్రంగా పోరాడినప్పుడు రాజ్య హింసను కూడా ఎదుర్కొంటున్నారు. బాల్కన్ యుద్ధంలో ఊచకోత జరిగింది. యుద్ధనేరాలు జరిగాయి. నేరస్తులకు శిక్ష పడలేదు. ఈ విషయాన్ని సెర్బియా స్త్రీలు వెలుగులోకి తెచ్చినందుకు వారిమీద దాడులు జరిగాయి. చంపేస్తామని బెదిరించారు.

సమరశీల మహిళా ఉద్యమాలు మళ్ళీ వచ్చాయి. పెరిగిన స్త్రీ చైతన్యానికి అనుగుణంగా వాళ్ళు ఉద్యమాలకు సిద్ధపడుతున్నారు. ఇది యూరప్ లో స్పష్టంగా కనిపిస్తోంది. కారకాస్ తీర్మానం సందర్భంలో యూరప్ లోని స్త్రీలంతా వీధుల్లోకి వచ్చి మార్చ్ 8, మే 1, నవంబర్ 25 తేదీల్లో తమ సంఘీభావాన్ని చాటుకున్నారు. ఉద్యమం జరిగిన ప్రతి ఒక్క రోజూ సమన్వయకర్తలు ప్రకటనలు చేస్తూ చాలాసార్లు యూరప్ అంతటా వరుస కార్యక్రమాలు నిర్వహించారు. సమరశీల మహిళా ఉద్యమాల్లో సమాజ పురోగతి కోసమూ పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయాల కోసమూ చర్చలు వికసించాయి. కమ్యూనిజం పట్ల వ్యతిరేకతను వ్యాపింపజేస్తూ ఈ ఉద్యమాలను ఆపాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇంతకు ముందులాగా ఇప్పుడీ ప్రయత్నాలు ఎక్కువగా విజయవంతం కావటం లేదు. స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మాడ్రిడ్ లో యాభై వేలమంది స్త్రీలు నవంబర్ 2015 లో రోడ్లమీదికి వచ్చారు. లైంగిక వేధింపులను ఎంతో చైతన్యంతో యువతులూ అమ్మాయిలూ ఎదుర్కొంటున్నారు.

యూరప్ మహిళా ఉద్యమాల్లో స్త్రీ కార్మికులూ యూనియన్లలో ఉన్నవాళ్ళూ మార్గదర్శకత్వం వహించారు. గ్రీస్ లో ఆర్ధిక మంత్రిత్వ శాఖలో పనిచేసే పారిశుధ్య కార్మిక మహిళలు పోయిన ఉద్యోగాలను మళ్ళీ సాధించుకున్నారు. పారిస్ హోటళ్ళలో పారిశుధ్య పనులు చేసే స్త్రీలు మంచి జీతాలకోసం పోరాడి గెలిచారు. నెదర్లాండ్స్ లో పారిశుధ్య కార్మిక మహిళలూ నర్సులూ ఏళ్ల తరబడి వాళ్ళ ఉద్యోగాల కోసం, గౌరవనీయమైన హోదా కోసం పోరాటం చేశారు. రేవు కార్మికుల పోరాటంతో కలిసి నడిచి కమిటీలలో పని చేశారు. పిల్లల ఆలనాపాలనా చూసే చైల్డ్ కేర్ టీచర్లు జర్మనీలో తమకు మంచి జీతాలకోసం, పని వాతావరణంకోసం వదిలిపెట్టకుండా సమ్మె చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ‘ఆడవాళ్ళ ఉద్యోగాల’ని అందరూ పిలిచే ఉద్యోగాలను ఉన్నతంగా చూడాలని పట్టుబట్టారు. ఫ్రెంచ్ మహిళలు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇలా అంటారు “సామాజిక పరిస్థితులు దిగజారి, స్త్రీల హక్కుల మీద రాజకీయ దాడులు జరిగితే అది తిరుగుబాటు అనే ప్రతిక్రియకు దారితీస్తుంది”.

పర్యావరణ తీవ్రవాదులుగా స్త్రీలు, ముఖ్యంగా యువతులు, మానవజాతి భవిష్యత్తును తమ బాధ్యతగా తీసుకున్నారు. వీళ్ళు ప్రతిఘటనలో మొదటివరుసలో ఉంటారు. ఉదాహరణకు పారిస్ లో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ మహాసభ దగ్గరా, గ్రీస్ లోని బంగారు గనులకు వ్యతిరేకంగా, జర్మన్ గనుల వద్ద విషపూరిత వ్యర్థాలను వదిలివేయటాన్ని వ్యతిరేకిస్తూ ముందుండి పోరాడారు. స్పెయిన్ నుండి యువతీయువకులు మాకు ఇలా రాశారు.: “ఆరగాన్ లో మాకు రిజర్వాయర్ ఆనకట్టలతో ఎప్పుడూ ముప్పు ఉంటోంది. అవి గ్రామాలనూ పంటపొలాలనూ ముంచేస్తున్నాయి. ‘అతురాందో యెసా’లో స్త్రీలు 20 ఏళ్ళుగా పర్యావరణ పరిరక్షణ కోసం, భూమిని రక్షించుకొని దాని ఘనత నిలబెట్టటం కోసం పోరాడుతున్నారు”.

ఫ్రాన్స్ లో, రష్యాలో, సెర్బియాలో, స్పెయిన్ లో, ఐస్లాండ్ లో.. ఇలా యూరప్ లో ప్రతిచోటా స్త్రీలు, ప్రతిమతానికీ చెందిన ఛాందసవాద గ్రూపులు చరిత్ర చక్రాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నం చేస్తుంటే దానినుంచి తమను తాము రక్షించుకుంటున్నారు. అబార్షన్ హక్కు కోసం వాదిస్తూ డిమాండ్ చేస్తున్నారు.

తూర్పు యూరప్ లో స్త్రీలు మునుపటి సోషలిస్ట్ దేశాలలో వారి అనుభవాలు, ఆ సోషలిస్ట్ దేశాల పతనం, సోవియట్ యూనియన్ కూలిపోవటంతో శిథిలమైన స్త్రీల హక్కులు.. వీటన్నిటినీ ఇప్పుడు పునర్మూల్యాంకనం చేస్తున్నారు. వాళ్ళిలా అంటున్నారు: “మౌలికమైన సామాజిక మార్పులు రానిదే జీవితంలోని అన్ని రంగాల్లో స్త్రీల స్వేచ్ఛ, పూర్తి సమానత్వం గురించి అసలు ఆలోచించలేం. మిగతా అణగారిన వర్గాలు సమీకృతమై ఏర్పరచుకున్న సంస్థలతోపాటు స్త్రీల సంఘాలు కలిసి పనిచేసి ఉద్యమించి సంపాదించుకున్న స్థాయి అది”.

యూరప్ లో మహిళా ఉద్యమం చాలా విభిన్నమైనది. కానీ అది చీలికలయింది. కిందటి శతాబ్దపు చివరిభాగంలో స్వతంత్రమైన స్త్రీల ఉద్యమాలు అసలే తగ్గిపోయాయి. అవి ప్రభుత్వ సంస్థలతో లీనమయాయి లేదా ప్రభుత్వేతర సంస్థలలో కలిసిపోయాయి. మహిళా ఉద్యమం దాని సామూహిక స్వభావాన్ని పోగొట్టుకుంది. పాతదైపోయింది. “అంతర్జాతీయ మహిళ” అనే ఆదర్శం ఇప్పుడు కొత్తగా వచ్చిన స్త్రీలకు ఆధారమై ఉద్యమం అయింది. వీళ్ళంతా చిన్నవయసులో ఉండి స్వతంత్రంగా సమరశీలతతో ఉన్న స్త్రీలు. వీళ్ళు ప్రపంచమంతా ఒకటేననేంత ఉత్సాహంతో ప్రజాస్వామ్యయుతంగా పార్టీలకీ సరిహద్దులకీ అతీతంగా పని చేస్తున్నారు. వీళ్ళు ఆర్థికంగా స్వతంత్రులు. జర్మనీలోని మహిళా సంఘం “కరేజ్” స్త్రీలకోసం ముఖ్యమైన విధానాలను రూపొందించే మహాకార్యాన్ని మొదలుపెట్టింది. ఈ విధానాలు అంతర్జాతీయ మహిళా మహాసభ ఆదర్శాలకు అనుగుణంగా ఉండి, అక్కడ ఆమోదించబడ్డాయి.

యూరప్ లో ఉన్న ప్రపంచానికంతటికీ చెందిన స్త్రీలు నాలుగు యూరోపియన్ మహాసభలను జర్మనీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, గ్రీస్ లలో నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళా విధానాల రూపకల్పనలో స్త్రీలే ఎక్కువ బాధ్యత తీసుకుంటున్నారు. ఈ పనులు చేపట్టటం వలన ఆయాదేశాల్లో మహిళా ఉద్యమం బలపడింది. యుక్త వయసులో ఉన్న స్త్రీలు ఇక్కడ ముఖ్యమైన, స్వతంత్రమైన పాత్రను నిర్వర్తిస్తున్నారు. మూడవ యూరోపియన్ మహాసభలో వాళ్ళు తమ సొంత’ ప్లీనం’ ను నిర్వహించారు.

వీరు చేసే ప్రతి పనీ ఆర్థిక వ్యవహారాలతో ముడి వేయబడింది. దీని ఉద్దేశ్యం ఆర్ధిక స్వాతంత్ర్యం, అంతర్జాతీయ సమైక్యత సాధించటం. కారకాస్ తరువాతనుంచీ అంతర్జాతీయ మహిళల కార్యాచరణ కోసం 200000 యూరోలను పోగుచేసి ఖర్చుపెట్టారు. బంగ్లాదేశ్ లోని ‘టెక్స్ టైల్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సెంటర్’ లో పనిచేస్తున్న ట్రేడ్ యూనియన్ పనివారలకు పోయిన ఉద్యోగాల కోసం, జర్మనీలోని వర్డీ అనే అతి పెద్ద ట్రేడ్ యూనియన్ కృషి చేసింది. ఈ ప్రతిపాదనను బంగ్లాదేశ్ టెక్స్ టైల్స్ యూనియన్ లో పని చేస్తున్న మన ‘జాలి’ (ఆసియా డిప్యూటీ కో- ఆర్డినటర్) ముందుకు తీసుకొని వచ్చింది.

నేపాల్ లో ఏప్రిల్ 2015 లో వచ్చిన భయంకరమైన భూకంపం తరువాత అక్కడివారి కోసం ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీలోని స్త్రీలు 23000 యూరోల విరాళాలను సేకరించారు. ఇవన్నీ ‘అంతర్జాతీయ మహిళల’ అద్భుత విజయాలు.

రోజావా లోని కుర్దిష్ స్త్రీల సాహసోపేత పోరాటాన్ని దృఢంగా నిర్మించారు యూరప్ లోని అంతర్జాతీయ మహిళలు. రోజావా పోరాటానికి మద్దతుగా సమైక్యతా యాత్రలు అనేక దేశాల్లో చేపట్టారు. రోజావా లోని కొబేన్ లో ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించటంలో అన్ని వయసుల స్త్రీలూ సాయం చేశారు.

“యూరప్ నుంచి మేం, అంతర్జాతీయ మహిళలందరం, ఇలా నమ్ముతున్నాం. ప్రపంచమంతటా స్త్రీల విముక్తి కోసం, మానవాళి విముక్తి కోసం జరుగుతున్న సమరం ఉధృతంగా ఉంది. మేం దానిలో ఉన్నామని గర్వంగా ఉంది. స్త్రీలను విముక్తి కోసం సమీకరించే మార్గంలో మనం కలిసి నడుద్దాం”.